మిషన్ కాకతీయకు ‘గ్రీన్ క్లైమేట్’ నిధులు
గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి రూ. వెయ్యి కోట్లు గ్రాంట్, రూ. వెయ్యికోట్లు రుణం
మరో రూ. 2 వేల కోట్లు ఇచ్చేందుకు నాబార్డు సుముఖం
నాబార్డు అధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నుంచి రూ. రెండు వేల కోట్లు ఆర్థిక సాయం అందనుంది. అందులో రూ. వెయ్యి కోట్లు గ్రాంటుగా, మరో రూ. వెయ్యి కోట్లు రుణంగా సమకూరనుంది. దీంతోపాటు జీసీఎఫ్‌కు దేశంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న నాబార్డు సైతం మిషన్ కాకతీయకు మరో రూ.2వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మేరకు నాబార్డు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
పర్యావరణ హిత ప్రాజెక్టు..: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడే, కర్బన ఉద్గారాలను తగ్గించే కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి ఐక్యరాజ్యసమితి 100 బిలియన్ డాలర్లతో జీసీఎఫ్ను ఏర్పాటు చేసింది. మన దేశంలో అలాంటి కార్యక్రమాలను గుర్తించి నిధుల కోసం ప్రతిపాదించేందుకు జీసీఎఫ్‌కు నాబార్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. చెరువులను పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించే కార్యక్రమంగా ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో... దీనికి ఆర్థిక సాయం చేసేందుకు జీసీఎఫ్ ముందుకు వచ్చింది. నాబార్డు ప్రతినిధులు దీనిపై ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. ఇక్రిశాట్ ప్రతినిధులతో పాటు శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఇందులో పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం తదితర అంశాలతో డీపీఆర్‌ను తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు అవసరమని అంచనా వేయగా... రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్లు సమకూరుస్తుందని రాజీవ్‌శర్మ హామీ ఇచ్చారు. మిగతా నిధుల్లో జీసీఎఫ్ రూ.2వేల కోట్లు, నాబార్డు మరో రూ.2వేల కోట్లు సమకూర్చుతాయని హామీ ఇచ్చాయి. ఇక వీటితోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులను పునరుద్ధరించి, వాటిని మంచినీటి సరస్సులుగా మార్చడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిసరాలను శుభ్రపర్చడం, వంటింటి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసి హాస్టళ్లకు సరఫరా చేయడం తదితర ప్రాజెక్టులను సైతం జీసీఎఫ్ కింద చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.