ఏడేళ్లు నిండి ఎనిమిదో పుట్టిన రోజు జరుపుకొనే పిల్లలు ఏం చేస్తారు? అమ్మా నాన్నలు తెచ్చిన కేకు కోసి తోటి పిల్లలతో పంచుకుని సంతోషిస్తారు. ఆ వయసులో అంతకు మించిన ఆనందం ఏముంటుంది? కానీ సిరిసిల్లకు చెందిన తెలుగమ్మాయి బ్లెస్సీ అలా చేయలేదు. తన ఎనిమిదో పుట్టిన రోజున అడవిలో ఆకుపచ్చ బంగారాలకు ప్రాణం పోసేందుకు విత్తనాలు వెదజల్లేందుకు వెళ్లి మురిసిపోయి మెరిసిపోయింది. పుట్టిన రోజుకు బ్లెస్సీ చేసిన సన్నాహం ఏంటో తెలుసా? బంకమన్ను తెచ్చి దాంతో విత్తన బంతులు తయారు చేస్తూ కూర్చుంది.
రెండేళ్ల క్రితమే ఇలా విత్తన బంతులు తయారు చేయడం మొదలు పెట్టిన బ్లెస్సీ ఇప్పటివరకూ ఏకంగా అరవై అయిదు వేల విత్తన బంతులు తయారు చేసింది. తోటి పిల్లలంతా సరదాగా ఆడుకుంటూ ఉంటే బ్లెస్సీ మాత్రం ఎక్కడికెళ్లినా... చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటూ ఉండేది. వాటిని ఇంటికి పట్టుకెళ్లి విత్తన బ్యాంకులో ఉంచేది. ఆ తర్వాత దగ్గర్లోని అడవిలో వాటిని వెదజల్లుతూ వచ్చేది. మొదట్లో స్నేహితులు బ్లెస్సీని చూసి నవ్వుకున్నా, రానురానూ ఆమె మనసులోని ఆకుపచ్చ సంకల్పం గురించి తెలుసుకొని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. పర్యావరణవేత్త కావడంతో నాన్నను చూసి ప్రకృతిపైనా, పర్యావరణం పైనా ప్రేమ పెంచుకున్న బ్లెస్సీ ఇప్పుడు కోట్లాది మందికి ఓ ఆకుపచ్చ బాట వేసిన స్ఫూర్తి.
తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలై పట్టణానికి చెందిన పదో తరగతి చదివే వినీశా ఉమాశంకర్‌ది మరో స్ఫూర్తి గాథ. అమ్మతో కలిసి ఇంట్లో ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయించుకునేందుకు సంచార ఇస్త్రీ బండి వద్దకు వెళ్లేది. బట్టలు ఎలా ఇస్త్రీ చేస్తున్నారో గమనించేంది. చింత నిప్పుల్లా భగ భగ మండే బొగ్గులు వేసిన ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేస్తూ ముచ్చెమటలు పోసుకొనే ఆ రజక దంపతులను గమనించింది. వినీశ మనసు కలుక్కుమంది. మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది. బొగ్గుల మంటతో పర్యావరణం పాడవుతుంది. అదే సమయంలో ఇస్త్రీ చేసేవాళ్లు నరకయాతన పడుతున్నారు. ఆ రెంటినీ దృష్టిలో పెట్టుకుంది. సౌర విద్యుత్తుతో పనిచేసే ఓ ఇస్త్రీ పెట్టెను తయారు చేసింది. అప్పటికి వినీశ వయస్సు పట్టుమని పన్నెండేళ్ళే.
కానీ, ఆ ఆవిష్కరణ వినీశకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. స్వీడన్‌కు చెందిన చిల్డ్రన్స్ క్లై్లమేట్ ఫౌండేషన్ వినీశకు అంతర్జాతీయ అవార్డును అందించి భుజం తట్టింది. ఈ విషయం తెలిసిన వెంటనే బ్రిటిష్ ప్రిన్స్ విలియమ్స్ గతేడాది జరిగిన ‘కాప్–26’ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు. ‘‘మాటలు వద్దు, చేతలు కావాలి. శిలాజ ఇంధనాలు, కాలుష్యంపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవద్దు. పాత పద్ధతులు ఆపేద్దాం. వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి’ అంటూ ఉద్విగ్నభరిత ప్రసంగం చేసింది. ఆ సదస్సులో పదిహేనేళ్ళ బాలిక వినీశ చేసిన ప్రసంగానికి ప్రపంచ ప్రతినిధులంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు.
స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ అందరు పిల్లల్లా ఎదగలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే వాతావరణ మార్పులు చేసే చేటు పైనా, పర్యావరణ మార్పుల పైనా, కాలుష్యం పైనా దృష్టి పెట్టింది. కాలుష్యం కారణంగా వాతావరణంలో చోటు చేసుకుంటోన్న భయానక మార్పుల గమనించి బాధపడేది. చదువుకుంటున్నా సరే... ఎప్పుడూ పర్యావరణంపైనే దృష్టి. తల్లితండ్రులకు ఇది నచ్చేది కాదు. చదువు మానేసి పర్యావరణం అంటూ తిరిగితే ఎలా అనుకున్నారు. అలాగని కూతురి ఇష్టాన్ని అడ్డుకోలేదు. దాంతో చదువుతో పాటు పర్యావరణ అంశాలపై ఉద్యమాల స్థాయికి ఎదిగింది. పదిహేనేళ్ళ వయసులో స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ఒంటరిగా వాతావరణ మార్పులకు నిరసనగా ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా దేశంలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. ‘మీ తరం వాళ్లు చేస్తోన్న పాపం మీ తర్వాతి తరాలకు శాపంగా మారుతోంది. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపండి’ అని గ్రెటా నినదించింది. ఇవాళ పర్యావరణం అంటే ప్రపంచంలో అందరికీ గుర్తొచ్చే చిన్న వయసు ఉద్యమకారిణిగా నిలిచింది.
మన కళ్ళెదుట కనిపిస్తున్న ఈ ముగ్గురి కథ మనకు ఏం చెబుతోంది? ఆ సంగతి అతి కీలకం. పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పాలి? ఎంతసేపూ వాళ్ళ మార్కుల గురించి, వాళ్ళు చేయబోయే ఉద్యోగాల గురించేనా మన ధ్యాసంతా! మార్కులు, కెరీరే కాదు... వారికి తాము ఉన్న ఈ భూగోళం మీద కూడా ప్రేమ, అవగాహన పెంచాలి. అదే ఇప్పుడు మానవాళికి కీలకం. తల్లితండ్రులు తమ పిల్లల మెదడులో ఆకుపచ్చ విత్తనాలు నాటాల్సిన సమయం ఇదే. ప్రస్తుతం ప్రకృతి ఎదుర్కొంటున్న విపత్తులకూ, వినాశనానికీ అదే పరిష్కారం.
నిజానికి బ్లెస్సీ, వినీశ, గ్రెటా– ఈ ముగ్గురికీ పర్యావరణాన్ని ప్రేమించమని ఎవరూ నేర్పలేదు. చుట్టూరా ఉన్నా ప్రకృతిని చూసి తమంతట తాముగా ఆ ఆకుపచ్చబాటలో అడుగులు వేశారు. కాకపోతే ముగ్గురి తల్లిదండ్రులూ ఈ బంగారు తల్లుల హరిత ప్రయత్నాలను అడ్డుకోలేదు. అదే ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది. పర్యావరణం కోసం, ప్రకృతి కోసం పసి ప్రాయంలోనే మనసులు పారేసుకున్న ముగ్గురూ అమ్మాయిలే కావడం విశేషం. ఈ ముగ్గురు బంగారు తల్లుల పసిడి ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి. కోట్లాది మందికి ప్రకృతి పాఠాలు నేర్పాలి.
Comments
Please login to add a commentAdd a comment