సాక్షి, అమరావతి: అందరం సాధారణంగా మంచినీళ్ల సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ల సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసి పోవడానికి ఏకంగా 450 సంవత్సరాల సమయం పడుతుందట. అలానే.. మనం వాడిపారేసిన టూత్‌బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలంట. పెళ్లిళ్లు, ఇతర పార్టీల సమయంలో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరకు అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్లదాక సమయం పడుతుంది.
పర్యావరణానికి విపరీతమైన హానికలిగించే ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ఈ ఏడాది జూలై 1 నుంచి నిషేధం విధించిన కేంద్రం.. ప్రజలందరూ నిత్యం ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కలిగే అనర్ధాల గురించి విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో పనిచేసే గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య (డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్) విభాగం ఈ మేరకు కరపత్రాలను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించే కార్యక్రమాలను మొదలుపెట్టింది.
పొంచి ఉన్న ప్రమాదాలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణానికి విపరీతమైన హాని ఏర్పడుతుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి వాడి పారేసిన నీళ్ల సీసాలు ఒక్కొక్కటిగా చివరికి భూమి పొరల్లోకి చేరతాయి. ఇలా.. లక్షలు, కోట్ల ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్ల పాటు భూమి పొరల్లో ఉండి వర్షం నీరు కిందకు ఇంకకుండా అడ్డుపడడం వంటి కారణాలతో భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోయి క్రమంగా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వేసుకునే బోరు 300–400 అడుగులు మేర తవ్వాల్సి రావడం.. కొన్నిచోట్ల 500 అడుగుల మేర తవ్వినా నీరు పడకపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలే.
Comments
Please login to add a commentAdd a comment