వాషింగ్టన్: ప్రపంచ పర్యావరణ సంతులనానికి అత్యంత కీలకమైన ఆర్కిటిక్ ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతమంతా గ్లోబల్ వార్మింగ్ కంటే నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనికి వాతావరణ మార్పులే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం అభిప్రాయపడింది.
గత 50 ఏళ్లలో చూసుకున్నా ఆర్కిటిక్ వేడెక్కే వేగం కనీసం రెట్టింపైందని తేల్చింది. ముఖ్యంగా వేడి గాలులతో పాటు మహాసముద్రాల వేడి ఆర్కిటిక్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని, తద్వారా మొత్తంగా పర్యావరణ వ్యవస్థను ఆర్కిటిక్ నేరుగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కడి భారీ మంచు పలకలు కరుగుతున్న వేగం కూడా క్రమంగా పెరుగుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ వాతావరణ పరిశోధకుడు, భౌతిక శాస్త్రవేత్త పీటర్ షిలెక్ తెలిపారు. ఇది పెను ప్రమాదానికి సంకేతమేనంటూ ఆందోళన వెలిబుచ్చారు. సముద్రమట్టాల పెరుగుదల వేగవంతమై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ తీర పట్టణాలు ముంపు బారిన పడటమే గాక మరెన్నో ఉత్పాతాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment