Arctic Ocean
-
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
మరుగుతున్న ఆర్కిటిక్! పెను ప్రమాదానికి సంకేతమా?
వాషింగ్టన్: ప్రపంచ పర్యావరణ సంతులనానికి అత్యంత కీలకమైన ఆర్కిటిక్ ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతమంతా గ్లోబల్ వార్మింగ్ కంటే నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనికి వాతావరణ మార్పులే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అభిప్రాయపడింది. గత 50 ఏళ్లలో చూసుకున్నా ఆర్కిటిక్ వేడెక్కే వేగం కనీసం రెట్టింపైందని తేల్చింది. ముఖ్యంగా వేడి గాలులతో పాటు మహాసముద్రాల వేడి ఆర్కిటిక్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని, తద్వారా మొత్తంగా పర్యావరణ వ్యవస్థను ఆర్కిటిక్ నేరుగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి భారీ మంచు పలకలు కరుగుతున్న వేగం కూడా క్రమంగా పెరుగుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ వాతావరణ పరిశోధకుడు, భౌతిక శాస్త్రవేత్త పీటర్ షిలెక్ తెలిపారు. ఇది పెను ప్రమాదానికి సంకేతమేనంటూ ఆందోళన వెలిబుచ్చారు. సముద్రమట్టాల పెరుగుదల వేగవంతమై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ తీర పట్టణాలు ముంపు బారిన పడటమే గాక మరెన్నో ఉత్పాతాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. -
అలలపై అణు విద్యుత్
మాస్కో: రష్యా మరో కీలక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ రూపొందించిన ఈ అణు కేంద్రానికి ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’గా నామకరణం చేశారు. దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు. తాజాగా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ తన గమ్యస్థలాన్ని చేరుకుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ అణు విద్యుత్ కేంద్రం బరువు 21 టన్నులు కాగా, ఎత్తు 470 అడుగులు ఉంటుంది. ఇందులోని 35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణురియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్ ద్వారా చుకోట్కాలోని లక్ష మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈ ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు. మిశ్రమ స్పందన.. ఈ తేలియాడే అణు కేంద్రంపై రష్యాలోని గ్రీన్ పీస్ అనే పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి అణు విద్యుత్ కేంద్రాలను తరలిస్తున్నప్పుడు ఏదైనా విపత్తు సంభవిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చుకోట్కా వంటి మంచు ప్రాంతాల్లో ఒకవేళ అణు విపత్తు సంభవిస్తే పర్యావరణంపై పడే దుష్ప్రభావం ఊహకు కూడా అందదని హెచ్చరించింది. దీన్ని ఓ ‘అణు టైటానిక్’గా సదరు సంస్థ అభివర్ణించింది. అయితే రోసాటమ్, ప్రభుత్వ అనుకూలవర్గాలు మాత్రం ఇందులోని సానుకూలతలు కూడా చూడాలని చెబుతున్నాయి. ఎందుకంటే మారుమూల చుకోట్కా ప్రాంతంలో ఈ అణు కేంద్రం ఏర్పాటుతో థర్మల్ ప్లాంట్, మరో అణుకేంద్రం మూతపడతాయని రోసాటమ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తద్వారా పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం భారీఎత్తున తగ్గుతుందని వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే సబ్మెరైన్ల వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, తమ అణు విద్యుత్ కేంద్రం కూడా అంతే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా ఇందులో భద్రతను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. -
మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు
వాషింగ్టన్: ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోని మంచు ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతోందని నాసా పరిశోధకులు చెప్పారు. సముద్రాల్లోని మంచు నిల్వలకు సంబంధించి 1979 నుంచి ఉన్న డేటాను అధ్యయనం చేసిన నాసాలోని గోడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకులు, ఈ ఏడాది అక్టోబర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ రెండు సముద్రాల్లోని మంచు కరిగిపోరుుందన్నారు. రికార్డు స్థారుులో మంచు కరిగిపోవడం ఆర్కిటిక్‌కు కొత్తేమి కాదని, కానీ అంటార్కిటిక్‌లో కరిగిపోవడమే ఆశ్చర్యానికి గురిచేసిందని శాస్త్రవేత్త వాల్ట్ మియర్ తెలిపారు. ఇంతలా మంచు కరిగిపోవడానికి వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులే కారణమన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గాలి, నీరు కూడా చాలా వేడిగా ఉంటున్నాయని, మంచు కరిగేందుకు ఇవి కూడా ఓ కారణం కావచ్చని వారు అంటున్నారు. -
మంచుసంద్రంలో టేబుల్ వేసుకొని..
ఈయన పేరు లుడోవికో ఇనౌడీ. ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విధ్వాసుడు. మంచి పియానిస్ట్. ఆరు పదుల వయసు ఉంటుంది. సాధారణంగా ప్రదర్శన అంటే ఒక పెద్ద సమూహం ముందు ఇస్తారు. వారుకొట్టే చప్పట్ల వర్షంలో తడుస్తూ మరింత సంతోషంగా వాయిస్తుంటారు. కానీ, ఈయన మాత్రం అసలు మనుషులే ఉండని ఓ చోటును ఎంచుకున్నాడు. ఉడుకు రక్తంతో ఉన్న వాళ్లుసైతం గజగజలాడుతూ వణికిపోయే ప్రాంతాన్ని తన ప్రదర్శన ప్రాంతంగా సెలక్ట్ చేసుకున్నాడు. ఎముకలు కొరికేసే చలిలో కనీసం ఒక హెడ్ క్యాప్ కూడా ధరించకుండా ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా వెళ్లి కూర్చున్నాడు. అది ఎక్కడో కాదు ప్రపంచలోనే అత్యంత కఠిన చలికలిగినటువంటి ఆర్కిటిక్ సముద్రం మీద. గడ్డకట్టి ఉండే ఈ సముద్రంలో అక్కడక్కడా మంచుముక్కలు తేలియాడుతుండగా వాటి మధ్యలో ఒక పెద్ద టేబుల్ లాంటి దానిని ఏర్పాటుచేసుకొని దానిపై పీయానో పెట్టుకొని కరిగిపోతున్న ఆ మంచువైపు దీనంగా చూస్తూ ఆయన సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో పెద్ద పెద్ద మంచుకొండల నుంచి ఐస్ ముక్కలు దబాల్లుమని సముద్రంలో పడుతున్నా ఆయన ఏమాత్రం భయపడకుండా ఆర్కిటిక్ సముద్రంలో తేలియాడుతూ మ్యూజిక్ ప్లే చేశారు. ఈ సమయంలో ఆయన కూర్చున్న డయాస్ కూడా మంచుగడ్డలతోపాటే సముద్రంలో తేలియాడుతూ ఉంటే నిబ్బరంగా కూర్చొని ఆయన ఈ సాహసం చేశారు. అయితే, ఆయన ఇలా ఎందుకు చేశారని అనుకుంటున్నారా.. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ క్రమంలో ఆర్కిటిక్ లోని మంచుమొత్తం కరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇలాగే కొనసాగితే ఇక సహజ సిద్ధమైన ఆ మంచుమండలం అంతర్ధానం అవుతుంది. ఇది మానవజాతికి అంత మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్‌ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పేందుకు ఆయన ఈ సాహసం చేశారు. -
‘ఆర్కిటిక్’పై తగ్గిన మంచు!
వాషింగ్టన్: ఆర్కిటిక్ సముద్రంపై ఉన్న మంచు ఈ చలికాలంలో రికార్డు స్థాయిలో వరుసగా రెండో ఏడాది కూడా తక్కువగా ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా వర్షాకాలం, ఎండాకాలంలో ఆర్కిటిక్ సముద్రం, దాని పక్కనున్న వాటిపై ఉన్న మంచు కరిగిపోతుంటుంది. ఈ నీరు చలికాలంలో మంచు రూపంలో సముద్రంపై పేరుకుపోతుంది. అయితే ఈ ఏడాది ఇలా పేరుకుపోయే మంచు చాలా తక్కువగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత తక్కువ ఏర్పడటం 1979 తర్వాత ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. భూమి మొత్తం మీద, ఆర్కిటిక్ ప్రాంతంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్లే తక్కువ మంచు ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. -
ఐడియా అదిరింది అమ్మాయీ..
ఇదో తేలియాడే నగరం డిజైన్. అదిరింది కదూ.. దీని డిజైన్‌లో ప్రముఖ పాత్ర చిత్రంలోని అమ్మాయిదే. పేరు మరియం చబానీ. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్. తన సహ ఆర్కిటెక్ట్‌లతో కలసి ఈమె ఈ డిజైన్‌ను రూపొందించారు. ప్రకృతి ప్రసాదించిన వనరైన నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకునే దిశగా ఈ తేలియాడే నగరం ‘అర్కిటిక్ హార్వెస్టర్’ను వీరు డిజైన్ చేశారు. ఇందులో 800 మంది హాయిగా ఉండొచ్చు. వారికి కావాల్సిన ఆహారం అంటే పళ్లు, పంటలు అన్నీ ఈ తేలియాడే నగరంలోనే పండుతాయి. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు ఫలకాల నుంచి మంచి నీటిని గ్రహించి, దాన్ని పంటల సాగుకు ఉపయోగిస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే సౌరఫలకాలు విద్యుత్‌ను అందిస్తాయి. నీటి నుంచీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సౌకర్యమూ ఇందులో ఉంది. ఈ డిజైన్ గతేడాది ఇన్నోవేషన్ ఆర్కిటెక్చర్ ఆన్ సీ పురస్కారాన్ని గెలుపొందింది.