రసాయన కాలుష్యం ప్రాణాంతకం! | Chemical Pollution Becoming Deadly | Sakshi
Sakshi News home page

Chemical Pollution: రసాయన కాలుష్యం ప్రాణాంతకం!

Published Wed, Jan 26 2022 4:13 PM | Last Updated on Wed, Jan 26 2022 4:13 PM

Chemical Pollution Becoming Deadly - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 40 వేలకు పైగా పారిశ్రామిక రసాయనాలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉండటమే కాకుండా వందల కొలదీ కొత్త రసాయనాలు ప్రతి సంవత్సరం అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో అతికొద్ది రసాయనాలపై మాత్రమే వాటి దుష్పరిణామాలకు సంబంధించి అధ్యయనం జరుగుతోంది. తీవ్ర హానికరమైన రసాయనాలు పర్యావరణంలోకి, నీటిలోకి, మట్టిలోకి.. వీటి ద్వారా ఆహారపు గొలుసులోకి చేరుతున్నాయి.

ఆహారం ద్వారా, తాగునీటి ద్వారా జీవుల శరీరంలో పేరుకుపోతున్నాయి. ప్రమాదకరమైన∙రసాయనాలైన పాలి క్లోరినేటెడ్‌ బై ఫినైల్స్‌ (పిసిబిఎస్‌) ఫ్తాలేట్స్, లెడ్‌ వంటి భార ఖనిజాలు, పురుగు మందులతో పాటు పర్యావరణంలో సుదీర్ఘ కాలం నిలిచి ఉండే ఔషధ సంబంధమైన రసాయనాలు మానవుల ఆరోగ్యంపై, ఇతర జీవరాశులపై, వృక్షాల పర్యావరణంపై తిరిగి కోలుకోని విధంగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం
రసాయన, ఇతర వ్యర్థ పదార్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఎంతో మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం రసాయన వ్యర్థాల వలన సుమారు 1.6 మిలియన్ల జనాభా రోగాల బారిన పడినట్లు అంచనా. 

కాలుష్య కారక రసాయనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులైన అనేక రకాల కాన్సర్లు, ప్రత్యుత్పత్తి లోపాలు, మానసిక వైకల్యాలు, ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు రావడానికి ఈ రసాయనాలు, ఇతర వ్యర్థాలే కారణమని తెలిసిన తరువాత ప్రజల్లో కొంత అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా పిల్లలు వీటి వలన అసంఖ్యాకంగా రోగాల బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లి గర్భంలో ఉండగానే ఈ రసాయనిక వ్యర్థాల బారిన పడుతున్నారు. పుట్టిన తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా చిన్నతనం నుంచే పిల్లలు కాలుష్య కోరలకు బలై అనేక వైకల్యాలను నిశ్శబ్దంగా భరిస్తున్నారు.

రసాయన కాలుష్యానికి కారణాలు
నీటిలో రసాయనాల చేరికకు ప్రధాన కారణం పరిశ్రమలు, అవి విడుదల జేసే అనేక రసాయనాలు, సంబంధిత వ్యర్థాలు. వీటన్నిటినీ ‘పాయింట్‌ సోర్స్‌’ కాలుష్య కారకాలుగా వర్గీకరించవచ్చు. వీటిలో చమురు శుద్ధి కర్మాగారాలు, పేపర్‌ పరిశ్రమలు, బొగ్గుతో విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గనులు, ఔషధ పరిశ్రమలు ముఖ్యమైనవి. వీటి నుంచి అనేక కర్బన (ఆర్గానిక్‌), అకర్బన (ఇన్‌ఆర్గానిక్‌) వ్యర్థాలతోపాటు భారలోహాలు వంటివి విడుదలై పరిసర ప్రాంతాల్లోని జలాలను కలుషితం చేస్తాయి. 

పారిశ్రామిక వ్యర్థాల ద్వారా విడుదలై సుదీర్ఘ కాలం పర్యావరణంలో ఉండే భార లోహాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి విడుదల అయిన ప్రదేశం నుంచి వర్షపు నీటి ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లోకి చేరి.. ఆ నీటిలో నివసించే రొయ్యలు, చేపలు వంటి జల జీవుల శరీరాలలో పేరుకుపోతాయి. ఆ విధంగా ఆ చేపలు, రొయ్యలను తినే మనుషులు, పక్షుల శరీరాలలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. భారలోహాల జీవిత కాలం నీటిలో గానీ, జీవులలో గానీ ఎక్కువ కాలం ఉండిపోతాయి. అందుచేత వీటిని తినే వారి దేహాల్లో క్రమంగా పోగుపడుతూ ప్రమాదకర స్థాయికి చేరి, సుదీర్ఘకాలంలో ప్రాణహాని కూడా ఏర్పడే స్థితి నెలకొంటుంది.

నీటిలో రసాయన కాలుష్యానికి రెండో ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో వాడే రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు. ఈ విధంగా వ్యవసాయ భూముల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను ‘నాన్‌ పాయింట్‌ సోర్స్‌’ కారకాలుగా చెబుతుంటాం. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికీకరించడం వల్ల రసాయనాల వాడకం భారీగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న జనాభా. వీరి ఆహార అవసరాలను తీర్చటం కోసం వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా దేశాలన్నీ ‘హరిత విప్లవాన్ని’ ప్రారంభించాయి.

దీనిలో భాగంగా ఉత్పత్తి పెంచటం కోసం యంత్రీకరించడం, అధిక దిగుబడులను సాధించుటకై సేంద్రియ ఎరువులతోపాటు రసాయన ఎరువుల వాడకాన్ని పెంచడం, పంటకు నష్టాన్ని కలిగించే పురుగులను నివారించడానికి, వ్యవసాయోత్పత్తుల నిలువ సమయంలో వచ్చే నష్టాలను తగ్గించడానికి, కలుపు మొక్కల నివారణకు విషరసాయనాల వాడకాన్ని ప్రోత్సహించారు. ఈ విధంగా పురుగు మందులు వాడటం ద్వారా ఉత్పత్తి పెరిగింది. మొదట్లో ఈ పురుగు మందుల వాడకం లాభదాయకంగా కనిపించినా, వీటిని అధిక మోతాదులో వాడితే దుష్పరిణామాలను, పర్యావరణానికి కలిగే హానిని, మనుషుల ఆరోగ్యంపై ఇవి చూపించే ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చిన తరువాత చాలా రకాల మొదటి తరం పురుగు మందులను నిషేధించారు.

వాస్తవంగా ఈ పురుగు మందులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే కనుగొన్నప్పటికీ (నోబెల్‌ బహుమతి గ్రహీత 1939లో పాల్‌ ముల్లర్‌ డీడీటీని కనుగొన్నారు) ముఖ్యంగా అప్పట్లో అంటు వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు ఈగలు, ఇతర కీటకాలను నివారించడానికి వాడే వారు. అయితే, అప్పట్లోనే ఈ కీటక నాశనులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి విచక్షణ రహితంగా అధిక మోతాదులో అడవులపైనా, చిత్తడి నేలలపైనా చల్లి పర్యావరణాన్ని కలుషితం చేశారు. అయితే వీటి దుష్పరిణామాల వలన కీటకాలతో పాటు అనేక జల జీవరాశులు అంతరించిపోయాయి. అనేక పరిశోధనల ద్వారా పర్యావరణంలో పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. 

ఆ పరిశోధన పత్రాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అమెరికన్‌ శాస్త్రవేత్త రాకేల్‌ కార్సన్‌ 1962లో ‘ది సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకంలో సుస్పష్టంగా పురుగుమందులను విచక్షణ రహితంగా అధిక మోతాదులో వాడటం వలన మానవ జాతే అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తత్ఫలితంగా ఐక్యరాజ్య సమితి 1970లో దీర్ఘకాలికంగా పర్యావరణంలో ఉండిపోయే పురుగుమందులను గుర్తించి నిషేధించింది. 

అభివృద్ధి చెందిన దేశాలు ఆ పురుగు మందులను నిషేధించినప్పటికీ, ఆయా దేశాలలో అప్పటికే వేల టన్నులలో ఉత్పత్తయిన పురుగుమందులను అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాయి. అయితే దిగుమతి చేసుకొన్న దేశాలు వాటిని తక్కువ ధరలకు కొన్నప్పటికీ.. వాటి దుష్పరిణామాలు తెలియక, నిరక్షరాస్యులైన ఆ దేశాల్లోనిæ వ్యవసాయదారులకు సరఫరా చేశాయి. ఆ విధంగా కొన్ని దేశాలు నిషేధిత పురుగుమందులను విచక్షణారహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేసుకున్నాయి.

కాలక్రమేణా తక్కువ పర్యావరణ నష్టాన్ని కలుగజేసే పురుగుమందుల రకాలను ఉత్పత్తి చేసినప్పటికీ, వాటి వాడకం అధికం కావడంతో అవశేషాలు నీటిలో మిగిలిపోయి ఇతర జీవుల జీవక్రియలపైన, మానవుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం మన దేశం రసాయన పురుగుమందుల తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో, పురుగుమందులు ఎగుమతి చేస్తున్న దేశాలలో 5వ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో చైనా ఉంది. భారత్‌లో 275 రకాల పురుగుమందులు రిజిస్టరై వున్నాయి. వీటిలో 115 పురుగుమందులు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. 2011–12 లెక్కల ప్రకారం.. భారత్‌లో 68,490 టన్నుల పురుగుమందులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పురుగుమందుల వాడకం మాత్రం 1991–92వ సంవత్సరంలో 72,130 టన్నుల నుంచి 2012–13 సంవత్సరానికి 56,090 టన్నులకు తగ్గింది. అయితే, పరిమాణం తగ్గినా అత్యంత శక్తిమంతమైన పురుగుమందుల ఉత్పత్తి పెరగటంతో ముప్పు కూడా పెరిగిందనే చెప్పాలి. 

పురుగుమందుల అవశేషాలు భారత్‌లోని వివిధ నీటి వనరులలో అధిక మొత్తంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం పర్యావరణంలో పోగుపడి ఉన్న పురుగుమందుల అవశేషాలు జీవులలో చేరి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తున్నాయి. అన్ని రకాల రసాయనాలు వాటి కాలుష్య ప్రదేశం ఏదైనప్పటికీ వివిధ మార్గాల ద్వారా అవి చేరుకునేది మాత్రం సమీప పల్లపు ప్రాంతాల్లో ఉన్న నీటి వనరుల్లోనికే. ఈ పురుగుమందుల అవశేషాలు ఆహారపు గొలుసులోని ప్లవకాల ద్వారా.. వాటిని భక్షించే మాంసాహార జీవుల్లోకి 10 రెట్లు అధికంగా చేరి చివరకు మాంసాహార జీవులు అంతరించిపోయే స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే అనేక పక్షులు, రాబందులు, గద్దలు, వన్యమృగాలు అంతరించిపోయే స్థాయికి చేరుకొన్నాయి.

ఈ పురుగుమందుల అవశేషాలకు తోడు.. గనుల తవ్వకం ద్వారా భూమి పొరలలో ఉన్న భార లోహాలు కూడా నీటిలోకి చేరుతున్నాయి. అవి కూడా దీర్ఘకాలం పర్యావరణంలో ఉండే పురుగుమందుల ప్రభావాన్ని అధికం చేస్తున్నాయి. ఈ విధంగా పురుగుమందుల అవశేషాలు, భార లోహాలతో కలుషితమైన నీరు అనేక లోతట్టు ప్రాంతాల్లోని మొక్కల్లోకి, కూరగాయల్లోకి, గడ్డి మేసి పాలిచ్చే పశువుల్లోకి చేరుతున్నాయి.  

శుద్ధి చేసినా పూర్తిగా తొలగించలేం! 
విష రసాయనాలు, భారలోహాల వలన నీరు ఒకసారి కలుషితమైతే.. ఆ నీటిని శుద్ధి చేసి వీటిని పూర్తిగా తొలగించడం అసాధ్యమైన పని. అంతేకాదు, తొలగించే ప్రక్రియ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కూడా. కాలుష్య రసాయనాల స్వభావం, పరిణామం, నీటి నాణ్యతలను బట్టి.. ఆ నీరు వాడకానికి పనికి వస్తుందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మంచినీటి నాణ్యత అందులో జీవరాశుల జీవన సరళిని జీవితాన్ని నిర్ణయిస్తుంది. చివరిగా చెప్పొచ్చేదేమంటే..  కాలుష్య కారకాల వాడకాన్ని తగ్గించడం తప్ప వేరే మార్గం లేదు. కాలుష్యంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించటం ద్వారా వారిని జాగృతపరచటమే మన కర్తవ్యం.

ఆహారోత్పత్తుల ద్వారా, చివరికి మంచినీటి ద్వారా కూడా మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తున్న రసాయన అవశేషాలతో కూడిన భార లోహాలు వింత వ్యాధులను కలుగజేస్తున్నాయి. ఇటీవల ఏలూరు వింత వ్యాధి సంఘటన చక్కటి ఉదాహరణ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా ఈ కారణాలే ఆ వింత వ్యాధికి మూలమని తెలియజేసింది. ఏలూరు వంటి లోతట్టు ప్రాంతాలు, అనేక మెట్ట ప్రాంతాలలో పంటల (ముఖ్యంగా వాణిజ్య పంటల)పైన వాడిన పురుగుమందులు వర్షపు నీటి ద్వారా.. అదే విధంగా ఖమ్మం జిల్లాలో గనుల  నుంచి పర్యావరణంలోకి వచ్చిన సీసం, పాదరసం నికెల్‌ వంటి భార లోహాలు తమ్మిలేరు వాగు ద్వారా చేరి, నిప్పుకు ఆజ్యం తోడైనట్లయి, ప్రజలు వింత వ్యాధి బారిన పడినట్లు అర్థమవుతుంది. ప్రొఫెసర్‌ కె. వీరయ్య , ప్రొఫెసర్‌ – డీన్, ఫ్యాకల్టీ ఆఫ్‌ నాచురల్‌ సైన్సెస్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జువాలజీ అండ్‌ ఆక్వాకల్చర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement