వరదల నియంత్రణకు స్పాంజి నగరాలు | Sponge City Concept For Flood Prevention: Sangireddy Hanumantha Reddy | Sakshi
Sakshi News home page

వరదల నియంత్రణకు స్పాంజి నగరాలు

Published Sat, Dec 18 2021 12:31 PM | Last Updated on Sat, Dec 18 2021 12:37 PM

Sponge City Concept For Flood Prevention: Sangireddy Hanumantha Reddy - Sakshi

మానవ కల్పిత కారణాలతో భూతాపం పెరుగుతోంది. వర్షపాతం పెరుగుతోంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. గంటకు మూడు చొప్పున అనేక జంతువృక్ష జాతులు అంతరిస్తున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, అశుద్ధ పరిశ్రమలతో బొగ్గు పులుసు వాయువు విడుదల పెరిగింది. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ముంపులు, వరదలు, తుఫాన్లు, కరువులు, రోగాలు పెరుగుతున్నాయి. మరోవైపు జలాశయాలు ఎండిపోతున్నాయి. ప్రపంచంలో 200 కోట్ల మందికి తాగునీరు లేదు. భవిష్యత్తులో ఈ సమస్యలు పెరిగే ప్రమాదముంది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్నట్లు మానవ మనుగడకు కొత్త ఆలోచనలు అవసరం. (చదవండి: దళితులు శూద్రులే... విడగొట్టారంతే!)

స్పాంజి నగరాలు వరదల నిర్వహణకు, పంట, మురికి కాలువల మెరుగుదలకు ఏర్పరచిన నూతన నగర నిర్మాణాలు. నదుల ఒడ్డున చెట్లు, పొదలు, రెళ్ళుగడ్డి, నీళ్ళు ఇంకే కాళ్ళబాటలు, ఆకుపచ్చని పైకప్పులు, వంతెనల మధ్య గుంటల్లో పొదలు, చిత్తడి మైదానాలు, వర్షపు నీటి వనాలు, జీవసంబంధ స్థలాలు స్పాంజి నగరాల భాగాలు. యు కొంగ్జియన్‌ చైనా పెకింగ్‌ విశ్వవిద్యాల యంలో నిర్మాణ విజ్ఞానశాస్త్ర, ప్రకృతి సౌందర్యశాస్త్రాల కళాశాల పీఠాధిపతి. ఈయన స్పాంజి నగరాలను ఆవిష్కరించారు. ఇవి నీటి ఎద్దడి, జలవనరుల కొరతను, ఉష్ణోగ్రతల ప్రభావాన్ని, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. వాన నీటిని ఒడిసిపట్టి, భూమిలో ఇంకింపజేసి నిలువచేస్తాయి. వరదలను అరికడతాయి. జీవావరణ, పర్యావరణాలను మెరు గుపరుస్తాయి. నున్నటి కాంక్రీటు నది గట్లు నీటి ప్రవాహ వేగాన్ని పెంచుతాయి. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...)

2012 జూలైలో బీజింగ్‌ వరదల్లో 79 మంది చనిపోయారు. పొలాలు మునిగిపోయాయి. ప్రజలు, జంతువులు, ఆస్తులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీనికి విరుగుడుగా చైనా పలు జిల్లాల్లో, నగరాల్లో స్పాంజి నగరాలను నిర్మించింది. నదుల కాంక్రీటు గట్లను తొలగించారు. చిత్తడి మళ్లను పెంచారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించారు. సహజ వనరులను కాపాడారు. సహజంగా పెరిగే పనికి రావనుకునే చెట్లు, మొక్కలు, పొదలను పెరగ నిచ్చారు. దీంతో వరదల సమస్య తీరింది. కప్పలు, పక్షులు తిరిగిచేరాయి. ఈ ప్రక్రియల్లో విద్యార్థుల ప్రమేయాన్ని పెంచారు. విద్యాసంస్థల్లో వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించారు. వాతావరణ మార్పుతో వచ్చే వరదల తీవ్రతను స్పాంజి నగరాలు తగ్గించాయి. మలేషియా, ఇండోనేషియా, బంగ్లా దేశ్‌ ఈ నగరాలతో ప్రయోజనం పొందాయి. సింగ పూర్, అమెరికా, రష్యా ఈ నగరాలను నిర్మిస్తు న్నాయి. పదేళ్ళ క్రితం జర్మనీ పర్యా వరణ పరిశోధక శాస్త్రజ్ఞులు హైదరాబాదులో స్పాంజి నగర ఏర్పాట్లు చేశారు. నాటి మెట్రోపాలిటన్‌ అభివృద్ధి అధికార సంస్థ వాటిని ఉపయోగించలేదు. కేరళ కొచ్చి స్పాంజి నగరం. కోజికోడ్, తిరువనంతపురంలలో స్పాంజి నగర నిర్మాణాలు జరుగుతు న్నాయి. గురుగ్రామ్, దిల్లీ, ముంబయిలలో స్పాంజి నగర పథకాలు రచించారు. 

వర్షపు నీటిని వేగంగా దూరంగా పంపడానికి గొట్టాలు, కాలువలు ఏర్పాటుచేయడం, నీళ్ళు పొంగి పారకుండా నది గట్లను కాంక్రీటుతో గట్టి పరచటం, ఎత్తు పెంచటం సంప్రదాయ పద్ధతులు. ఇవి జల ప్రవాహాన్ని తగ్గించవు. బయటికి, లేదా మరో వైపుకు నీళ్ళు వేగంగా పోయేటట్లు చేస్తాయి. స్పాంజి నగర పద్ధతి వర్షపు నీటిని భూమిలో ఇంకేటట్లు, భూఉపరితల నీటిని నిదానంగా పారే టట్లు చేస్తుంది. దీన్ని మూడు ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. 1. నీటి ఊట ప్రదేశంలో, స్పాంజి రంధ్రాల లాగా చెరువులు, కుంటలు, ఇంకుడు గుంటలు నిర్మించటం. 2. చెట్లు, మొక్కలు నాటి నదుల, కాలువల ప్రవాహ దిశను వంకరటింకరగా మార్చటం. చిత్తడి నేలలను ఏర్పరిచి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నీళ్ళు భూమిలో ఇంకేటట్లు చేయడం. దీంతో పచ్చని ప్రదేశాలు, కృత్రిమ వనాలు, అటవీ స్థలాలు పెరుగుతాయి. పశుపక్ష్యా దులకు నీటి వసతి ఏర్పడుతుంది. వాటి నివాస స్థలాలు పెరుగుతాయి. (చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!)

3. జనావాసాల ముంపును తగ్గించటం. పై రెండు పద్ధతులు పాటిం చిన తర్వాత మిగులు నీరు ఆటంకం లేకుండా నదులు, సముద్రాల్లో కలిసేటట్లు చేయాలి. కాలువలను పూడ్చరాదు. చెత్త చెదారాలతో నింపరాదు. వర్షాకాలానికి ముందు కాలువల పూడిక తీయాలి. ప్రవాహ మార్గంలో, లోతట్టు ప్రాంతాల్లో నిర్మా ణాలు చేయరాదు. పట్టణాల్లో చెరువులను పూడ్చి, వాణిజ్య నిర్మాణాలు, అపార్టు మెంట్లు, ఇల్లు కట్టుకుంటారు. గుంటూరులో ఒకప్పటి ఎర్ర చెరువు నేటి బస్‌స్టాండ్‌. 1977 నవంబర్‌ ఉప్పెనలో మూడు వందల మందిని ముంచిన నల్ల చెరువు నేడు పెద్ద నివాస ప్రాంతం. నీటితో కుస్తీ పట్టరాదు. దాని దారిన దాన్ని పోనివ్వాలి.

స్పాంజి నగర నిర్మాణానికి సంప్రదాయ పద్ధతుల ఖర్చులో నాలుగో వంతు ఖర్చవుతుంది. వరదల నియంత్రణకు కాంక్రీటు నేల, గట్ల ఏర్పాటు, దప్పిక తీర్చుకోటానికి విషం తాగటం లాంటిది. వాతావరణ మార్పు అనువర్తనకు మన జీవన విధానాలను మార్చుకోవాలి. ఇవి ప్రకృతికి దూరమైన మనుషులను మరలా ప్రకృతితో మమేకం చేస్తాయి.


- సంగిరెడ్డి హనుమంత రెడ్డి 

వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement