సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనే ఉన్నాయని, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది.
కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్ రిజర్వ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్‌స్ట్రాక్ట్ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు.
తాజా నివేదికపై అధికారుల్లో చర్చ
2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో 19, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్ కారిడార్లు, బఫర్ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు.
కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్ అయ్యాయని, టైగర్ కారిడార్ ఏరియాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు వచి్చనట్టుగా ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు.
ప్రాజెక్ట్ టైగర్ ద్వారా సత్ఫలితాలు
- అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం డోబ్రియాల్
- ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం
ములుగు (గజ్వేల్): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్)ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్‌సీఆర్‌ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్‌సీఆర్‌ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment