Mass Planting Of Conocarpus May Be Harmful - Sakshi
Sakshi News home page

అమ్మో.. కోనోకార్పస్‌!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు

Published Wed, Jul 6 2022 2:31 AM | Last Updated on Wed, Jul 6 2022 8:59 AM

Mass Planting Of Conocarpus May Be Harmful - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కోనోకార్పస్‌.. ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని విరివిగా పెంచుతున్నారు. అయితే.. వీటితో పర్యావరణానికి పలువిధాలుగా విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు అన్ని పట్టణాల్లో రోడ్ల మధ్య సుందరీకరణ కోసం ఈ మొక్కను పెంచుతున్నారు. నిటారుగా, ఏపుగా పెరిగి నిత్యం పచ్చదనంతో కళకళలాడే ఈ మొక్క తన దుష్ప్రభావాలతో ఇప్పుడు వార్తల్లోకెక్కింది.  

ఇదీ మొక్క కథ 
కోనోకార్పస్‌ మొక్కలో అనేక ఉపజాతులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లోని మడ (సముద్రం–నదులు కలిసే ముఖద్వారాల వద్ద ఉండే) అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటిని మాంగ్రూవ్‌ మొక్కలనీ పిలు­స్తారు. తీర ప్రాంతాల్లో పెరగడం వల్ల నిత్యం ప్రవాహాలను తట్టుకునేందుకు వీలుగా వీటి వేర్లు బురదనేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్లి నాటుకుని, మొక్కకు స్థిరత్వమిస్తాయి.

ఫలితంగా తీర ప్రాంతాల్లోని నీటి ప్రవాహాల వేగాన్ని ఇవి అడ్డుకుంటాయి. తక్కువ కాలంలో ఏపుగా పెరగడం, వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతీ రుతువులోనూ పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ గుణమే.. దీన్ని అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ మొక్కను సుందరీకరణకు వినియోగిస్తున్నారు.

రోడ్లకు ఇరువైపులా, మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చదనంతో నిండిపోతున్నాయి. వారాల వ్యవధిలో మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో మన రాష్ట్రంలోనూ అనేక మున్సిపాలిటీలు ఈ మొక్కలను నాటాయి. హరితహారంలోనూ దీన్ని నాటుతున్నారు. దీని దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని హరితహారంలో నాటొద్దని, నర్సరీల్లో పెంచొద్దని అన్ని జిల్లాల డీఆర్‌డీవో విభాగాలను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు సరిగా అమలు కావట్లేదు. వెంటనే ఈ మొక్కల్ని నిషేధించాలని పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 

పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం లేని మొక్క ఇది
కోనోకార్పస్‌ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నా­యని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు లోతుకంటూ పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూ­నికేషన్‌ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్, ఇరాన్‌ వంటి దేశాలు ఈ మొక్కను నిషేధించాలని నిర్ణయించాయి. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు. వీటిపై పక్షులు గూళ్లు కట్టవు.

పుప్పొడిపై సీతాకోకచిలుకలూ వాలవు. ఏ జంతువూ దీని ఆకులను తినవు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా, అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగజేస్తుంది. 
– వీణ, మహబూబ్‌నగర్‌ డీఎఫ్‌వో  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement