అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది!
అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్‌గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు!
పగుళ్లు ఎక్కడెక్కడ?
► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం.
జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్
ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే...
► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి.
► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే!
► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి.
► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి.
► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది.
► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
భూగర్భ జలమే ముఖ్య ఆధారం
మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే...
► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి.
► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం.
► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు.
ఏం జరుగుతోంది?
► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది.
► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది.
► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి.
► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు.
► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు.
ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’
– జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే
– సాక్షి, నేషనల్ డెస్క్
అమెరికా భూమికి పగుళ్లు!
Published Mon, Sep 18 2023 5:45 AM | Last Updated on Mon, Sep 18 2023 5:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment