
క్యాంపు కార్యాలయంలో వ్యర్థాల బదలాయింపు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అభివృద్ధి చట్టం (ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ యాక్ట్) – 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో మొట్టమొదటి వ్యర్థాల బదలాయింపు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
► ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఇలా వ్యర్థాల సక్రమ నిర్వహణకు తొలి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించడం మంచి పరిణామం.
► రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరిస్తోందనడానికి ఇదే నిదర్శనం. వ్యర్థాలను వంద శాతం సురక్షితంగా పార వేయడం, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఆడిటింగ్ చేయడం ఏపీఈఎంసీ ఏర్పాటు వెనుక లక్ష్యాలు.
► వ్యర్థాల కో ప్రాసెసింగ్, రీసైక్లింగ్ ద్వారా తిరిగి వినియోగించే సంస్థలకు ప్రోత్సాహకం ఉంటుంది.
► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ బీఎస్‌ఎస్ ప్రసాద్, సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.