పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఏం చేయగలం!’ అని ఎవరైనా నిట్టూరిస్తే... ‘ఎంతో చేయగలం’ అని చెప్పడానికి కెన్యాకు చెందిన ఎల్లియానే బలమైన ఉదాహరణ. పచ్చని చెట్టు నీడలో, చల్లటి వెన్నెల నీడలో ఆమె విన్న కథల్లో పర్యావరణ ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాథాయ్ ఉంది. మాథాయ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వేలాది మొక్కలు నాటింది ఎల్లియానే. ‘చిల్డ్రన్స్ విత్ నేచర్’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చింది.
స్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చెప్పడానికి బలమైన ఉదాహరణ ఎల్లియానే వాంజీ క్లిస్టన్. చిన్నప్పుడు తాను విన్న కథల్లో కథానాయిక వంగరి మాథాయ్. నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథాయ్ చెట్ల రక్షణ, మొక్కల పెంపకం గురించి చేసిన కృషి, ఉద్యమం అంతా ఇంతా కాదు. ఆమె ప్రారంభించిన ‘గ్రీన్ బెల్ట్ మూమెంట్’ గురించి కథల రూపంలో విన్నది ఎల్లియానే. వంగరి మాథాయ్ స్ఫూర్తితోనే గ్రీన్ వారియర్‌గా మారింది.
మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధుల గురించి వినడం ద్వారా ‘మార్పు’ గొప్పదనం ఏమిటో తెలుసుకుంది. ‘మన భూగోళాన్ని రక్షించడానికి నేను సైతం’ అంటూ ప్రయాణం ప్రారంభించింది. పర్యావరణ కార్యక్రమాలలో భాగంగా కింగ్ చార్లెస్‌లాంటి వారిని కలుసుకోవడం, గ్రామీ అవార్డ్ గ్రహీత మెజీ అలాబీ, మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్‌తో కలిసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.
‘నేను ప్రొఫెసర్ మాథాయ్ కావాలనుకుంటున్నాను’ అని చిన్నప్పుడు ఎల్లియానే తల్లితో అన్నప్పుడు ఆ తల్లి నుంచి తక్షణ స్పందనగా రావాల్సిన మాట... వెరీ గుడ్! అయితే కూతురు నుంచి వచ్చిన మాట విని తల్లి భయపడింది. మాథాయ్‌ను మానసికంగా ఎలా గాయపరిచారో, కొట్టారో, జైల్లో పెట్టారో వివరంగా చెప్పింది. ‘నువ్వు డాక్టర్ లేదా లాయర్ కావడం మంచిది’ అని కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆ తల్లి. తల్లి చెప్పింది విని ఎల్లియానే భయపడి ఉండాలి. కానీ అలా జరగలేదు. పైగా ప్రొఫెసర్ మాథాయ్‌పై మరింత గౌరవం పెరిగింది.
తొలిసారిగా ఒక విత్తనాన్ని నాటింది. అది మొలకెత్తిన అద్భుతాన్ని చూసింది. ఇక అప్పటినుంచి చెట్ల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటూనే ఉంది. కెన్యా ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర జేన్ జుగునా ద్వారా మొక్కల పెంపకానికి సంబంధించి పనిముట్ల నుంచి సరైన మట్టి వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘చిల్డ్రన్ విత్ నేచర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పింది. ‘మీరు తలచుకుంటే మీ ప్రాంతంలో మార్పు తీసుకు రావచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చింది.
‘2020 నాటికి వేలాది మొక్కలను నాటాను. కెన్యాలోనే కాకుండా విదేశాలలో కూడా ట్రీ లవర్స్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశాను’ అంటున్న ఎల్లియానే మొరాకో నుంచి జాంబియా వరకు తాను వెళ్లిన ఎన్నో దేశాలలో మొక్కలు నాటింది. అయితే వాతావరణ మార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ సదస్సులలో పాల్గొనడం వల్ల ‘గతంతో పోల్చితే మొక్కల పెంపకంలో వెనక పడ్డాను’ అనే బాధ ఎల్లియానేలో కనిపిస్తుంది.
చెట్ల పెంపకం సంగతి సరే, మరి చదువు సంగతి ఏమిటి?
చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది ఎల్లియానే. పిల్లల తోపాటు జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి వివరించే ‘సేవ్ అవర్ వైల్డ్‌లైఫ్’ అనే డాక్యుమెంటరీలో కనిపించింది. ఈ డాక్యుమెంటరీలో తనకు ఇష్టమైన జంతువు ఏనుగు గురించి చెప్పింది. వేట కంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి కలుగుతున్న ముప్పు గురించి వివరంగా మాట్లాడింది. ‘ఆఫ్రికాలోని గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు నాటాలి అనేది నా కల’ అంటుంది ఎల్లియానే. ‘ఏదీ అసాధ్యం కాదు’ అనేది ఎల్లియానే నోటినుంచి ఎప్పుడూ వినిపించే మాట.
Comments
Please login to add a commentAdd a comment