‘బ్రిటిష్‌ హైకమిషనర్‌’గా 19 ఏళ్ల అమ్మాయి..! | 19 Years Gautam Nidhi Dons British High Commissioner Hat For A Day In Delhi | Sakshi
Sakshi News home page

‘బ్రిటిష్‌ హైకమిషనర్‌’గా 19 ఏళ్ల అమ్మాయి..!

Published Fri, Oct 18 2024 10:27 AM | Last Updated on Fri, Oct 18 2024 10:57 AM

19 Years Gautam Nidhi Dons British High Commissioner Hat For A Day In Delhi

19 సంవత్సరాల గౌతమ్‌ నిధి బ్రిటిష్‌ హైకమిషనర్‌ హోదాలో గంభీరంగా ఉపన్యసించింది. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. శాస్త్రవేత్తల నుంచి నవీన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఇది సరే, 19 సంవత్సరాల అమ్మాయి ‘బ్రిటిష్‌  హైకమిషనర్‌’ ఏమిటి! అని ఆశ్చర్య΄ోతున్నారా... అవును... ఇది అక్షరాల నిజం... 

అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘హై కమిషనర్‌ ఫర్‌ ఏ డే’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అమ్మాయిల నుంచి 140 అప్లికేషన్‌లు వచ్చాయి. ఈ సంవత్సరం కర్ణాటకకు చెందిన గౌతమ్‌ నిధి(19) ‘భారత్‌లో ఒకరోజు బ్రిటిష్‌ హైకమిషనర్‌’గా ఎంపికైంది. గౌతమ్‌ నిధి ఢిల్లీలోని మిరాండ హౌజ్‌ కాలేజీలో హిస్టరీ, జాగ్రఫీలలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేస్తోంది. స్కెచ్చింగ్, పద సంపద, సాంస్కృతిక దౌత్యం, విదేశాంగ విధానాలపై గౌతమ్‌కు ఆసక్తి. బ్రిటిష్‌  హైకమిషనర్‌గా గౌతమ్‌ నిధి ఒకరోజంతా తీరికలేనంత కార్యక్రమాలతో గడిపింది.

యూకే–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె తొలి కార్యక్రమం మొదలైంది. దిల్లీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ని,  సందర్శించిన గౌతమ్‌ దివ్యాంగులకు ఉపకరించే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఆ తరువాత ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ’కి వెళ్లి మన దేశంలో వ్యాక్సిన్‌ల అభివృద్ధికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంది. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో రోజాంతా అనేక సమావేశాలు నిర్వహించింది.

‘బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఫర్‌ ఏ డే’గా ఉండడం మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. సోలార్‌ ఎనర్జీ నుంచి బయోటెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన చేసుకునే అదృష్టం దక్కింది. సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అంటుంది గౌతమ్‌ నిధి. ‘ఈరోజు నిధి నుండి నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. యూకే–ఇండియాలలోని నవీన సాంకేతిక పరిజ్ఞానం నుంచి గ్లోబల్‌ చాలెంజ్‌లను స్వీకరించి దూసుకెళుతున్న యువతుల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం’ అంటుంది మన దేశంలోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ లిండీ కామెరూన్‌.

(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement