‘నీ బర్త్‌డేకి ఆకాశంలో చుక్కలు తెంచుకురమ్మంటావా’ అని ఆకాశానికి నిచ్చెనలు వేసేవారి కంటే, నేల మీదే ఉండి స్నేహితులకు పచ్చటి మొక్కను కానుకగా ఇచ్చేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు. ‘రేపటి సండేను ఎలా ఎంజాయ్ చేద్దాం బ్రో..’ అని ఆరా తీసేవారికి భిన్నంగా ‘రేపటి సండే సరదాగా ఫీల్డ్‌వర్క్ చేద్దాం’ అని పలుగు పారా అందుకుంటున్న వాళ్లు పెరుగుతున్నారు. అవును...యూత్ మారుతుంది!
నిన్నా మొన్నటి వరకైతే యూత్‌లో కొద్దిమందికి ‘పర్యావరణం’ అనేది ఎకాడమిక్ విషయం మాత్రమే. ఏ ఉపన్యాసం, వ్యాసంలోనో ఆ ‘స్పృహ’ కనిపించి మాయమయ్యేది. కోవిడ్ సృష్టించిన విలయం, దాని తాలూకు నిర్జన నిశ్శబ్ద విరామం తమలోకి తాము ప్రయాణించేలా చేసింది. ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచింది. రణగొణధ్వనులతో క్షణవిరామం లేని జీవితంలో ప్రశ్న ఒకటి వచ్చి ఎదురుగా నిలుచుంది.
‘ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?’ ఆత్మవిమర్శ అనే పెద్దమాట తగదుగానీ, ఎక్కడో ఏదో మొదలైంది. అదే యూత్‌ను ‘ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిజమ్’లో చురుకైన పాత్ర నిర్వహించేలా చేస్తుంది. గత రెండు సంవత్సరాల అధ్యయనాలు,సర్వేలు చెబుతున్నది ఏమిటంటే– ‘భారతీయ యువతరంలో పర్యావరణ స్పృహ పెరిగింది’ అని. ( ఉదా: గోద్రెజ్ స్టడీ, క్రెడిట్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్ట్, నీల్సన్)
‘పర్యావరణం’ అనేది యూత్ డిన్నర్ టేబుల్ డిస్కషన్‌లోకి రావడమే కాదు, ఫ్యాషన్ ఛాయిస్‌లలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. ‘గతంలో యువ వినియోగదారులు ప్రింట్ లేదా స్టైల్ నచ్చితే కళ్లు మూసుకొని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పీస్ ఎలా తయారైందో అడిగి తెలుసుకుంటున్నారు. అది పర్యావరణహితం కాకపోతే స్టైల్‌గా ఉన్నాసరే తిరస్కరిస్తున్నారు. వారిలో వచ్చిన మార్పుకు ఇదొక సంకేతంగా చెప్పవచ్చు’ అంటున్నారు ఎకో–కాన్షియస్ ఫ్యాషన్ డిజైనర్ అంజలి పాటిల్.
‘సౌఖ్యం,సుఖం, స్టైల్ వరుసలో ఇప్పుడు పర్యావరణహిత దృష్టి కూడా చేరింది. మనవంతుగా ఏదైనా చేయాలి అనుకోవడమే దీనికి కారణం’ అంటున్నారు మరో డిజైనర్ రజిని అహూజ. టీ–షర్ట్‌ల ద్వారా కూడా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది యూత్. అందమైన వారి టీ–షర్ట్‌లపై కనిపించే... ‘ఎర్త్ డే ఎవ్రీ డే’ ‘సే నో ప్లాస్టిక్‌బ్యాగ్’ ‘గుడ్ ఎన్విరాన్‌మెంట్ పాలసీ ఈజ్ గుడ్ ఎకనామిక్ పాలసీ’....నినాదాలు ఆకట్టుకుంటున్నాయి.
కేవలం దుస్తుల విషయంలోనే కాదు ఆహారం, విహారం, వినోదం....మొదలైన వాటిలో కొత్త చాయిస్‌లు వెదుక్కుంటున్నారు. ప్యాస్టిక్ వ్యర్థాల నివారణపై స్నేహితులతో కలిసి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న స్నేహ షాహి(బెంగళూరు), హితా లఖాని(ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేటర్), వర్ష రైక్వార్ (గ్రాస్‌రూట్స్ క్లైమెట్ స్టోరీటెల్లింగ్), ‘మార్చ్ ఫర్ క్లీన్’ అంటూ పర్యావరణహితం వైపు అడుగులు వేయిస్తున్న హినా సైఫీ....ఇలా చెప్పుకుంటూ పోతే యువ ఆణిముత్యాల జాబితా చాలా పెద్దది. వారు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నారు.
నదులలోని కిలోల కొద్ది వ్యర్థాలను పైకి తీయడం, మొక్కలు నాటడం, చెట్లకు నీరుపోయడం...కాస్త శ్రమగా అనిపిస్తుందా? ఆ చిరుశ్రమను మరిచిపోవడానికి ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖెల్ జాక్సన్ ‘ఎర్త్‌సాంగ్’తో పాటు పర్యావరణ పాప్ పాటలు ఎన్నో ఉన్నాయి!
చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక
Comments
Please login to add a commentAdd a comment