ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2021’ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం విడుదల చేశారు. ఇందులో గత రెండేళ్లలో ఏపీ 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల సాధించి టాప్‌లో నిలిచింది. 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. గత రెండేళ్లలో దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదైందని నివేదిక వెల్లడించింది.
ఇందులో అడవుల విస్తీర్ణం 1,540 చదరపు కిలోమీటర్లు, చెట్ల విస్తీర్ణం 721 చదరపు కి.మీ అని తెలిపింది. 2021లో దేశంలో మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లుండగా.. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతమని నివేదిక తెలిపింది. మొత్తం భౌగోళిక ప్రాంతంలో అత్యధిక అటవీ విస్తీర్ణమున్న రాష్ట్రాల్లో మిజోరం (84.53%), అరుణాచల్‌ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%), నాగాలాండ్ (73.90%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కి.మీ ఉండగా.. 2019తో పోలిస్తే 17 చదరపు కి.మీ పెరుగుదల నమోదైందని తేలింది. దేశంలోని అడవుల్లో కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులుండగా, 2019తో పోలిస్తే 79.4 మిలియన్ టన్నుల పెరుగుదలగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment