చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు.
కేస్ స్టడీ 1:
సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది.
కేస్ స్టడీ 2:
రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా?
కేస్ స్టడీ 3:
సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో.
రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్‌గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్‌గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి.
1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు.
2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్‌ఫెక్ట్‌గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత.
3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది.
4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది.
5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment