house cleaning
-
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్‌గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
Summer: సీలింగ్ ఫ్యాన్.. క్లీనింగ్ ఇలా...!
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు. మరో పద్ధతి... పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్‌ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్‌గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి. ఇవి చదవండి: ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..! -
మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది
చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. కేస్ స్టడీ 1: సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది. కేస్ స్టడీ 2: రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా? కేస్ స్టడీ 3: సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో. రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి. 1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు. 2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్ఫెక్ట్గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత. 3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది. 4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది. 5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది. -
ఇళ్లు శుభ్రం.. ఒళ్లు భద్రం..
పనివాళ్లెవరూ అందుబాటులో లేని ఈ లాక్డౌన్ ప్రతి ఒక్కరికి ఒళ్లు వంచాల్సిన అవసరాన్ని కల్పించింది. దీంతో ఇప్పుడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఇంటిపని తప్పనిసరిగా మారింది. మరోవైపు ఇంటిపని చేయడం ఎన్నో రకాలుగా మంచిదని, ముఖ్యంగా శారీరక ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఊతమిస్తుందని, అలాగే జిమ్ అలవాటు ఉన్న వారికి అవి అందుబాటులో లేని బాధ నుంచి ఉపశమనంగా కూడా ఇవి కండరాలకు పని కల్పిస్తాయని సిటీకి చెందిన ఫిట్నెస్ ట్రైనర్లు అంటున్నారు. –సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్ : లాక్డౌన్ టైమ్‌లో టీవీలకో, చాటింగ్ కబుర్లకో పరిమితం కాకుండా ఇంటిని తీర్చిదిద్దుకోవడంపైన శ్రద్ధ పెడితే అది ఇంటికి శుభ్రతను వంటికి ఆరోగ్యాన్ని అందించడం తథ్యం. అంతేకాదు... జిమ్‌లు మూత పడిన నేపథ్యంలో కాస్త ఉపశమనంగా... జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లలో కొన్ని వర్కవుట్స్ చేసిన ఫలితం ఇంట్లో చేసే కొన్ని పనుల ద్వారా కూడా పొందవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్.. ఫ్యాట్ బర్నింగ్.. ఇల్లు ఊడ్వడం, కడగడం, తడిగుడ్డతో ఫ్లోరింగ్ క్లీన్ చేయడం వంటి పనులతో చేతులు, నడుం, పొత్తికడుపు దగ్గర కండరాలు ఫ్లెక్సిబులిటిని సంతరించుకుంటాయి. ఈ పనులు ఫ్రంట్ షోల్డర్, బ్యాక్ షోల్డర్ మజిల్స్‌కు ఉపయుక్తం. ఓ వైపువంగి ఫ్లోర్ తుడవడం అంటే జిమ్‌లో బెంట్ ఓవర్ లేటరల్ రైజెస్ వర్కవుట్ చేసినట్టే. దీనితో గంటకు కనీసం 200దాకా కేలరీలు ఖర్చు అవుతాయట. షోల్డర్స్,ట్రైసప్స్,బైసప్స్ బలపడతాయి. సీలింగ్ శుభ్రం... ఫిట్నెస్ భద్రం బూజు పట్టిన సీలింగ్, ఫ్యాన్ రెక్కలు మొత్తం దుమ్ము... దీనిని శుభ్రం చేయడంలో భాగంగా చేతులు కాసేపు పైకి పెట్టి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాలు, వీపు భాగాలు చైతన్యవంతమవుతాయి. ఫిట్నెస్ సెంటర్లో చేసే పుల్ ఓవర్ ఎక్సర్‌సైజ్‌తో ఇది సమానం. ఆబ్లిక్స్. సైడ్ ఫ్యాట్ తగ్గుతాయి. బ్యాక్ మజిల్స్ బలోపేతానికి ఉపకరిస్తుంది. దీని కోసం కనీసం గంట సమయం వెచ్చిస్తే దాదాపు 100 కేలరీలు ఖర్చుఅవుతాయి. ఆరోగ్యానికి ‘గార్డ్’నింగ్... మొక్కలకు నీళ్ళు పోయడం, పాదులు తీయడం,నాటడం, పిచ్చిమొక్కల్ని తొలగించడం... వంటివన్నీ మన ఇంటి ముంగిటకు ఇంపైన శోభను, మన వంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి.ఫోర్ఆర్మ్ మజిల్స్, ట్రైసప్, అప్పర్‌బాడీ మజిల్స్ చురుకవుతాయి..మొక్కలు నాటడంలో భాగంగా తవ్వడం వంటి పనుల కారణంగా గంటకు దాదాపు 250 కేలరీల ఖర్చుఅవుతాయట. ఉతుకు.. హుషారుకు.. మాసిన దుస్తులు ఉతకడంలో భాగంగా పిండడం వంటి పనులతో చేతులకు సంబంధించిన మజిల్స్, ఫోర్ ఆర్మ్ మజిల్స్, మోచేతుల నరాలు ఉత్తేజితమవుతాయి. జిమ్‌లో అయితే దీనికోసం రిస్ట్కర్ల్ వర్కవుట్ చేయిస్తారు. బట్టలుతకడం, వాటిని ఆరవేయడం, ఇస్త్రీ చేయడం... వగైరా పనులు జిమ్‌లో చేసే షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్ తో సమానంగా లాభాలను అందిస్తాయి. అప్పర్బ్యాక్ ధృడమవుతుంది. ఇంటింతై... వ్యాయామమంతై.. అల్లికలు, కుట్లు వంటివాటివల్ల గంటకు దాదాపు 85 కేలరీలు, అంట్లుతోమడం, గిన్నెలు కడగడం వంటి పనుల వల్ల 110 నుంచి 160 కేలరీల దాకా ఖర్చుఅవుతాయి. మోటార్‌బైక్, కారు వంటి వ్యక్తిగత వాహనాలు కడగడం వంటి పనులతోనూ దేహానికి మంచి వ్యాయామం. కారు కడగడం వల్ల గంటకు దాదాపు 350 కేలరీలు ఖర్చుచేయవచ్చునట. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలేవి లేనివాళ్లు, వ్యాయామ పరంగా ప్రత్యేకలక్ష్యాలు (ఉదాహరణకు ఒబెసిటీ, పొట్టతగ్గించుకోవడం కండలు పెంచడం వంటివి)లేనివాళ్ళు లాక్ డవున్ తర్వాత కూడా ఇంటి పనులు అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే ఎక్కువ బరువులెత్తే పని చేసినపుడు కింద కూర్చుని ఎత్తాలి. లేని పక్షంలో బ్యాక్‌పెయిన్ వచ్చే ప్రమాదముంది. అలాగే అంట్లు తోమేటపుడు గ్లవ్స్ ఉపయోగించడం, తోమడం పూర్తయ్యాక గ్లిజరిన్, మాయిశ్చరైజర్ వంటివి వాడడం బూజులు దులిపేటపుడు కంట్లో దుమ్ము పడకుండా చూసుకోవడం, ఒకవేళ పడితే వెంటనే రోజ్‌వాటర్‌తో శుభ్రపరుచుకోవడం..వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. .ఒకే భంగిమలో ఉండి పనిచేసేపుడు తరచుగా విరామాలివ్వాలి. లేని పక్షంలో శారీరక సమన్వయం లోపించవచ్చు. -
మనం కక్కితే వారొచ్చి క్లీన్ చేస్తారు!
వీకెండ్ పార్టీలు ఎంత చెత్తా చెదారాన్ని మిగులుస్తాయో, ఇల్లెంత గజిబిజిగా, గందరగోళంగా కనిపిస్తుందో తెల్లారితే గానీ మనకు తెలియదు. ఇక మద్యం పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. ఎటూ చూసినా పగిలిన సీసాల గాజుపెంకులు, పాడైపోయిన ఆహారం నుంచి వెలువడే కంపు వాసన, మందెక్కువై ఎవరైనా వాంతులు చేసుకుంటే చూసిన మనకు డోకులు వచ్చే పరిస్థితి. పీకలదాకా తాగిన మద్యం ప్రభావంతో తల తిరుగుతుంటే ఇల్లెలా శుభ్రం చేసుకోవాలో, ఆఫీసుకెలా రెడీ అవ్వాలో తెలియక తికమకపడే వారికో శుభవార్త. కచ్చితంగా ఇలాంటి పార్టీల కోసమే ఏర్పాటైంది ఓ సర్వీసు సంస్థ. ఆ సంస్థ పేరు 'మార్నింగ్-ఆఫ్టర్ మెయిడ్స్'. న్యూజిలాండ్‌లో ఇద్దరు మహిళలు ఏర్పాటుచేసిన ఈ సరికొత్త వ్యాపార సర్వీసుసంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఫ్రాంచైజీల కోసం పలు దేశాల నుంచి పోటీపడుతున్నారు. ఈ సంస్థ ఉద్యోగులు లేదా పనిమనుషులు మనం ఫోన్ చేసిన తక్షణమే మన ఇంటి ముందు వాలిపోతారు. చిటికెలో ఇల్లంతా శుభ్రం చేస్తారు. పగిలిన సీసాలను, గ్లాసు ముక్కలను జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. పాడైపోయిన ఆహారాన్ని మున్సిపల్ తొట్లలో పడేస్తారు. మన ఇళ్లలో పనిచేసే మామూలు పనిమనుషుల్లా కాకుండా వీరు ఏ వస్తువును ఎక్కడుంచాలో సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. ఇంటి యజమానులు ఆఫీసుకు ఆలస్యం కాకుండా వేడినీళ్లను కాచి పెడతారు. బట్టలను సర్దిపెడతారు. పార్టీ హ్యాంగోవర్ దిగేందుకు చక్కటి కాఫీ లేదా మద్యం పెగ్గు కలిపిస్తారు. టిఫిన్ లేదా భోజనం కూడా వండిపెడతారు. మన మూడ్‌ను బట్టి అవసరమైతే నచ్చిన సంగీతం కూడా వినిపిస్తారు. తిని పడేసిన మాంసం ముక్కలు వృధా కాకుండా కొన్నిసార్లు తర్ఫీదు పొందిన కుక్కల్ని కూడా తీసుకొస్తారు. అందించే సర్వీసులను బట్టి చార్జీలు కొంచెం అటు ఇటూ మారినా ఇల్లు వైశాల్యం, గంటల చొప్పునే చార్జీలు వసూలు చేస్తారు. పార్టీ సైజును బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయలను వసూలు చేస్తారు. అదనంగా గంటకు 1500 రూపాయలు చార్జి చేస్తారు. వాంతులు చేసుకుంటే అదనపు చార్జీలు వర్తిస్తాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నివసిస్తున్న రెబెక్కా ఫోలే, కేథరిన్ అషర్స్ట్ అనే ఇద్దరు రూమ్మేట్స్ కలిసి ఈ సరికొత్త సర్వీసు సంస్థను ఇటీవలే ఏర్పాటుచేశారు. ఓ రోజు తమ ఇంట్లో పార్టీ జరిగిన తెల్లారి నిద్రలేచాక చూస్తే అంతా చెత్తచెత్తగా, గందరగోళంగా కనిపించిందని, అబ్బా, ఎవరైనా వచ్చి ఇల్లు శుభ్రం చేస్తే బాగుండునని పించిందని, ఆ ఆలోచన నుంచే ఈ సంస్థ పుట్టుకొచ్చిందని రెబెక్కా మీడియాకు తెలిపారు. ఈ ఆలోచన గురించి ఫేస్బుక్లో మిత్రులతో చర్చించగా, అందరినుంచి సానుకూల స్పందన లభించిందని చెప్పారు. ఈ సంస్థ గురించి మీడియాలో కూడా విస్తృత ప్రచారం కావడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పలు దేశాల నుంచి ఇలాంటి సర్వీసుల కోసం ఫ్రాంచైజీలకు ప్రతిపాదనలు వస్తున్నాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమకు ఇంతకుముందు ఎలాంటి వ్యాపారానుభవం లేదని చెప్పారు. అయితే వ్యాపార దృక్పథంతో పాటు సేవా దృక్పథం దెబ్బతినకుండా ఈ వ్యాపారాన్ని మరింత ఎలా మెరగుపర్చవచ్చునో సలహాలిస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.