పనివాళ్లెవరూ అందుబాటులో లేని ఈ లాక్‌డౌన్ ప్రతి ఒక్కరికి ఒళ్లు వంచాల్సిన అవసరాన్ని కల్పించింది. దీంతో ఇప్పుడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఇంటిపని తప్పనిసరిగా మారింది. మరోవైపు ఇంటిపని చేయడం ఎన్నో రకాలుగా మంచిదని, ముఖ్యంగా శారీరక ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఊతమిస్తుందని, అలాగే జిమ్ అలవాటు ఉన్న వారికి అవి అందుబాటులో లేని బాధ నుంచి ఉపశమనంగా కూడా ఇవి కండరాలకు పని కల్పిస్తాయని సిటీకి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్లు అంటున్నారు.
–సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ : లాక్‌డౌన్ టైమ్‌లో టీవీలకో, చాటింగ్ కబుర్లకో పరిమితం కాకుండా ఇంటిని తీర్చిదిద్దుకోవడంపైన శ్రద్ధ పెడితే అది ఇంటికి శుభ్రతను వంటికి ఆరోగ్యాన్ని అందించడం తథ్యం. అంతేకాదు... జిమ్‌లు మూత పడిన నేపథ్యంలో కాస్త ఉపశమనంగా... జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లలో కొన్ని వర్కవుట్స్ చేసిన ఫలితం ఇంట్లో చేసే కొన్ని పనుల ద్వారా కూడా పొందవచ్చు.
ఫ్లోర్ క్లీనింగ్.. ఫ్యాట్ బర్నింగ్..
ఇల్లు ఊడ్వడం, కడగడం, తడిగుడ్డతో ఫ్లోరింగ్ క్లీన్ చేయడం వంటి పనులతో చేతులు, నడుం, పొత్తికడుపు దగ్గర కండరాలు ఫ్లెక్సిబులిటిని సంతరించుకుంటాయి. ఈ పనులు ఫ్రంట్ షోల్డర్, బ్యాక్ షోల్డర్ మజిల్స్‌కు ఉపయుక్తం. ఓ వైపువంగి ఫ్లోర్ తుడవడం అంటే జిమ్‌లో బెంట్ ఓవర్ లేటరల్ రైజెస్ వర్కవుట్ చేసినట్టే. దీనితో గంటకు కనీసం 200దాకా కేలరీలు ఖర్చు అవుతాయట. షోల్డర్స్,ట్రైసప్స్,బైసప్స్ బలపడతాయి.
సీలింగ్ శుభ్రం... ఫిట్‌నెస్ భద్రం
బూజు పట్టిన సీలింగ్, ఫ్యాన్ రెక్కలు మొత్తం దుమ్ము... దీనిని శుభ్రం చేయడంలో భాగంగా చేతులు కాసేపు పైకి పెట్టి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాలు, వీపు భాగాలు చైతన్యవంతమవుతాయి. ఫిట్‌నెస్ సెంటర్‌లో చేసే పుల్ ఓవర్ ఎక్సర్‌సైజ్‌తో ఇది సమానం. ఆబ్లిక్స్. సైడ్ ఫ్యాట్ తగ్గుతాయి. బ్యాక్ మజిల్స్ బలోపేతానికి ఉపకరిస్తుంది. దీని కోసం కనీసం గంట సమయం వెచ్చిస్తే దాదాపు 100 కేలరీలు ఖర్చుఅవుతాయి.
ఆరోగ్యానికి ‘గార్డ్’నింగ్...
మొక్కలకు నీళ్ళు పోయడం, పాదులు తీయడం,నాటడం, పిచ్చిమొక్కల్ని తొలగించడం... వంటివన్నీ మన ఇంటి ముంగిటకు ఇంపైన శోభను, మన వంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి.ఫోర్‌ఆర్మ్ మజిల్స్, ట్రైసప్, అప్పర్‌బాడీ మజిల్స్ చురుకవుతాయి..మొక్కలు నాటడంలో భాగంగా తవ్వడం వంటి పనుల కారణంగా గంటకు దాదాపు 250 కేలరీల ఖర్చుఅవుతాయట.
ఉతుకు.. హుషారుకు..
మాసిన దుస్తులు ఉతకడంలో భాగంగా పిండడం వంటి పనులతో చేతులకు సంబంధించిన మజిల్స్, ఫోర్ ఆర్మ్ మజిల్స్, మోచేతుల నరాలు ఉత్తేజితమవుతాయి. జిమ్‌లో అయితే దీనికోసం రిస్ట్‌కర్ల్ వర్కవుట్ చేయిస్తారు. బట్టలుతకడం, వాటిని ఆరవేయడం, ఇస్త్రీ చేయడం... వగైరా పనులు జిమ్‌లో చేసే షోల్డర్ వీల్ ఎక్సర్‌సైజ్ తో సమానంగా లాభాలను అందిస్తాయి. అప్పర్‌బ్యాక్ ధృడమవుతుంది.
ఇంటింతై... వ్యాయామమంతై..
అల్లికలు, కుట్లు వంటివాటివల్ల గంటకు దాదాపు 85 కేలరీలు, అంట్లుతోమడం, గిన్నెలు కడగడం వంటి పనుల వల్ల 110 నుంచి 160 కేలరీల దాకా ఖర్చుఅవుతాయి. మోటార్‌బైక్, కారు వంటి వ్యక్తిగత వాహనాలు కడగడం వంటి పనులతోనూ దేహానికి మంచి వ్యాయామం. కారు కడగడం వల్ల గంటకు దాదాపు 350 కేలరీలు ఖర్చుచేయవచ్చునట. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలేవి లేనివాళ్లు, వ్యాయామ పరంగా ప్రత్యేకలక్ష్యాలు (ఉదాహరణకు ఒబెసిటీ, పొట్టతగ్గించుకోవడం కండలు పెంచడం వంటివి)లేనివాళ్ళు లాక్ డవున్ తర్వాత కూడా ఇంటి పనులు అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
అయితే ఎక్కువ బరువులెత్తే పని చేసినపుడు కింద కూర్చుని ఎత్తాలి. లేని పక్షంలో బ్యాక్‌పెయిన్ వచ్చే ప్రమాదముంది. అలాగే అంట్లు తోమేటపుడు గ్లవ్స్ ఉపయోగించడం, తోమడం పూర్తయ్యాక గ్లిజరిన్, మాయిశ్చరైజర్ వంటివి వాడడం బూజులు దులిపేటపుడు కంట్లో దుమ్ము పడకుండా చూసుకోవడం, ఒకవేళ పడితే వెంటనే రోజ్‌వాటర్‌తో శుభ్రపరుచుకోవడం..వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. .ఒకే భంగిమలో ఉండి పనిచేసేపుడు తరచుగా విరామాలివ్వాలి. లేని పక్షంలో శారీరక సమన్వయం లోపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment