మాట్లాడుతున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి, అమరావతిబ్యూరో: దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ చాలా అవసరమని, లేకపోతే బలవంతుడిదే రాజ్యం అవుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) 44వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన చలమేశ్వర్ మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగిందని, తాను చెప్పిందే సరైందన్న వితండ వాదంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆ వితండవాదంతో తాను విభేదించడం వల్లే తన మాటలు వివాదాస్పదమయ్యాయన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లలకు జవాబుదారీతనం నేర్పాలని సూచించారు. మంచి, చెడులను ధైర్యంగా చెప్పగలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.
తెలంగాణలో సీపీఎస్ రద్దు చేస్తానన్న బాబు ఏపీలో చేయరెందుకు..?
మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సీపీఎస్ అంశంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే సీపీఎస్ రద్దు చేస్తామంటూ వాగ్దానాలు ఇచ్చారని, మరి నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఉద్యోగులను మోసం చేయడానికి ఓ టక్కర్ కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వం కాలయాపన నెపంతో కమిషన్ వేస్తే అది ఎప్పటికీ తేలదని, పరిశీలిస్తూ పర్యటిస్తూ దాటవేస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కమిషన్ వేసి, నివేదిక తెప్పించి రద్దు చేయాల్సిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment