ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓటర్లను రకరకాలుగా బెదిరించి, ప్రత్యర్థి పార్టీలకు మద్దతుదార్లని భావించినవారి ఓట్లు తొలగించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది ఆక్షేపణీయం. 2017–18లో వివిధ పార్టీలకు ముట్టిన నిధుల్లో సగం ‘అజ్ఞాత వర్గాల’ నుంచి వచ్చిందేనని ఏడీఆర్ నివేదిక చెప్పిందంటేనే మన దేశంలో ఎలాంటి పరిస్థితులు న్నాయో అర్ధమవుతుంది. అవినీతిపరులైన రాజకీయవేత్తలు, నేరగాళ్లు, నిరంకుశాధికారవర్గాల అనుబంధం అందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరమేమంటే రాజకీయనేతల ఆదాయపన్ను వివరాలు బయటికి పొక్కకుండా పాలకులు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్థితిలో అవినీతి అంతకంతకు విస్తరించడంలో వింతేముంది?
‘‘అవినీతిపరులైన రాజకీయవేత్తలు పదేపదే తిరిగి అధికారంలోకి వస్తూంటారు. గత 30 ఏళ్లుగా మన కళ్లెదుట ఆవిష్కరించుకుంటూ వస్తున్న దృశ్యం ఇదే. బయటకు తెలిసిన ఆదాయ వనరులకు మించిపోయిన సంపద పోగుపడినందుకు విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎప్పుడూ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తు న్నారు. గత ఐదేళ్ల వ్యవధిలోనే ఒక అభ్యర్థి తన ఆదాయం 1000 శాతం పెరిగినట్టు చూపిన మరుక్షణమే విచారణ ప్రారంభించే యంత్రాంగం రంగంలోకి దిగాలి. దీనికి కారణం పసలేని విచారణ అయినా అయి ఉండాలి లేదా అలా స్వేచ్ఛగా వదిలేయడమైనా అయి ఉండాలి’’ – జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశం (11.09.2017)
ఈ సందర్భంగా ఒక బౌద్ధయుగ సూక్తి గుర్తుకొస్తోంది. ఈనాడు ‘ధర్మపోరాటం’ పేరు చాటున అధర్మ ప్రచారాలకు పాల్పడే పాలకులున్నట్టే బౌద్ధయుగంలో కూడా ‘ధర్మధరుడ’నే పేరిట ఒక అబద్ధాలకోరు, వంచకుడు ఉండేవాడు. ‘పేరు ధర్మరాజు, పెను వేపవిత్తయా’ అన్నట్టు ఇంతకూ జ్ఞానం ప్రధానమా? వ్యక్తి నడవడిక శీలం ప్రధానమా? అన్న చర్చ ముందుకు రావడంతో కాశీ రాజు సర్వసాధారణంగా జ్ఞానాన్ని గౌరవించేవాడే అయినా, ఈసారి ఆయన దృష్టి మనిషి శీలంపై పడింది. ధర్మధరుడ్ని అందరూ జ్ఞానిగా భావిస్తున్నందున, ముఖ్యంగా రాజుకు నచ్చిన వాడవడంవల్ల, ఊళ్లో ఉన్న వ్యాపారులు కూడా ధర్మధరుడి జ్ఞానం మీదనే దృష్టి పెట్టి అతడి అబద్ధాల్ని నమ్మి, అతడి శీలాన్ని పరిగణనలోకి తీసుకోక భంగపడ్డారు.
ధర్మధరుడు చివరికి పరుల ఆస్తిని దోచుకునే దొంగగా మారినట్టు వ్యాపారులే కనిపెట్టేశారు. ఈ గుట్టు తెలి యకముందు ధర్మధరుడిని జ్ఞానిగా భ్రమించిన ఒక వజ్రాల వ్యాపారి దుకాణానికే అతడు (ధర్మధరుడు) ఎసరుపెట్టాడు. కొట్టు యజమానితో మాట్లాడుతున్నట్టే నటిస్తూ ధర్మధరుడు నింపాదిగా ఓ వజ్రాన్ని కాస్తా కాజేసి ఉడాయించాడు. ఇలా వరసనే మూడురోజులు ధర్మధరుడు ఈ పనిలోనే ఉన్నాడు. దాంతో వ్యాపారి ఉండబట్టలేక ‘జ్ఞాని’గా ఫోజులు పెడుతున్న ధర్మధరుడితో ‘‘ఓరి దొంగ వెధవా, నీ జ్ఞానం తగలబడా ఇన్నాళ్లూ నిన్ను గౌరవించి తప్పు చేశాన’’ని అన్నాడట. అతగాడికి నాలుగు తగిలించి మరీ పంపించేశాడట.
అలాగే, సుప్రీంకోర్టు మాజీ సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ ధర్మాసనం గడచిన రెండు జనరల్ ఎన్నికల మధ్య అయిదేసి ఏళ్ల వ్యవధిలోనే రాజకీయవేత్తల ఆస్తులు పాదరసంలా పాకి ఇంతింతై ఆకాశాన్ని అంటడానికి దారితీస్తున్న కారణాలను శోధించి విచారించవలసిన అవసరం ఉందని భావించి దేశాన్ని హెచ్చరించి ఉంటుంది. రెండేళ్లనాడు ధర్మాసనం చేసిన ఈ హెచ్చరికకు దేశంలోని శాసనకర్తలు (ఆంధ్రప్రదేశ్ సహా) ఈ రెండేళ్లలోనూ ఎంత ‘విలువ’ ఇచ్చారో, ఇస్తున్నారో ఈ వంచకుల్ని భరిస్తున్న దేశ ప్రజా బాహుళ్యానికి తెలుసు. ఇలాంటివారిని చూసే నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ‘‘దుర్దశ, ఇబ్బంది, ఆపద అనేవి దాదాపు మనుషులందరికీ వచ్చేవే. కానీ మనిషి వ్యక్తిత్వాన్ని గుణగణాలను పరీక్షించాలంటే అతడికి అధికారం కట్టబెట్టి చూడండి, అతని అసలు సరుకేదో తెలిసిపోతుంది’’ అన్నాడు.
పాలకుడి ఆలోచనలోనే, దృక్పథంలోనే బలహీనత ఉంటే, అతడి వ్యక్తిత్వమూ (క్యారెక్టర్) అలాగే తయారవుతుందని ఐన్‌స్టీన్ స్పష్టం చేశాడు. ఈ వ్యక్తిత్వ వికాసం మన కేంద్ర, రాష్ట్ర పాలకుల్లో (పార్టీ బ్రాండ్ ఏదైనా) సొంత సంపదను మేట వేసుకోడానికి ఉపయోగపడినంతగా రిపబ్లిక్ రాజ్యాంగ నిర్దేశాలను అనుసరించడానికి తోడ్పడటం లేదు. సుప్రీం ధర్మాసనం చెప్పడమే కాదు, 1993లోనే కేంద్ర హోంశాఖ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. వోహ్రా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ దేశంలో ‘రాజకీయ వ్యవస్థ నేరమయమైపోయింది, రాజకీయవేత్తలు, నేరగాళ్లు (క్రిమినల్స్), అధికారగణాల (బ్యూరాక్రాట్) మధ్య పీటముడి ఏర్పడి పనిచేస్తోందని నిశితమైన వ్యాఖ్య చేసిందని మరచిపోరాదు. ఈ ‘పీటముడి’ బాగా బిగిసిపోయి ఉన్నందుననే రాజకీయుల ఆదాయపు పన్ను వివరాలను బహిరంగంగా తెలపరాదన్న నిబంధన వచ్చింది, చివరికి సమాచార హక్కు చట్టం కింద కూడా ఏ వివరాలూ వెల్లడించరాదన్న నిబంధనను కేంద్రం విధించింది.
ప్రజా సేవకులమని విర్రవీగుతున్న వందలాదిమంది శాసనకర్తల వద్ద ‘లెక్కకు అందకుండా మేట వేసుకుంటున్న సంపద వివరాల’ను ఎందుకు ప్రజా బాహుళ్యానికి తెలపకుండా దాచవలసి వస్తోందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా జవాబులేదు. పైగా తాజా నివేదికలో ‘ప్రజాస్వామ్య సంస్కరణల అమ లుకు’ ఉద్దేశించిన సంస్థ (ఏడీఆర్) 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ పార్టీలకు అందిన నిధులలో 50 శాతం పైగా ‘అజ్ఞాత వర్గాల’ నుంచి ముట్టాయని ప్రకటించింది. ఇలా ప్రజలకు తెలియని వేలకోట్ల నిధులు అందుకున్నవాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీఎంసీ, ఎన్‌సీపీ ఉన్నాయి. అధికార దుర్వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ‘అప్పుల కుప్ప’గా మార్చి, దివాళా దశకు నెట్టిన ‘తెలుగుదేశం’ ఇలాంటి నిధులు పొందిన ప్రాంతీయ పార్టీలలో అగ్రస్థానంలో ఉంది. మరొక మాటలో చెప్పాలంటే, 200 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉన్న అమెరికాలో 450మంది బిలియనీర్‌లు ఉండగా, కేవలం 70 ఏళ్ల వయస్సుగల భారత గణతంత్ర రిపబ్లిక్‌లో 400 మంది పై చిలుకు బిలియనీర్లు, మరికొన్ని వేలమంది మిలియనీర్లు తలెత్తడం విశేషమో, విషాదమో విజ్ఞులకు తెలియాలి. ప్రపంచ ప్రసిద్ధ విశ్లేషణా సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ జరిపిన తాజా సర్వే ప్రకారం భారతదేశ సంపదలో 50 శాతం కేవలం 9మంది చేతుల్లో పోగుబడి ఉండగా, 60 శాతం జనాభా వద్ద ఉన్న సంపద 5 శాతమేనని వెల్ల డైంది. మరో లెక్క ప్రకారం, ఇతర దేశాల్లో సంపదంతా జనాభాలో కేవలం ఒక్కశాతం మంది వద్దనే పోగుబడి ఉండగా, అదే 120 కోట్ల జనాభాగల మన దేశం (ఇండియా)లో కేవలం 10 మంది దగ్గరే సంపదలో మెట్టు భాగం కేంద్రీకరించి ఉంది. ఒకవైపున ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తి మన దేశమేనని చెప్పుకుంటున్న దశలో ఇంతటి వ్యత్యాస భారతాన్ని కూడా చూస్తున్నాం.
ప్రజలకు ఓటుమీద ప్రజాస్వామ్యంమీద విశ్వాసం లేనట్టుగా, ‘ఓటుహక్కును ప్రతి పౌరుడూ వినియోగించాలి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికల’ని ‘ఓటు హక్కు వినియోగం పవిత్ర ధర్మమ’నీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి దగ్గరనుంచి రాష్ట్రాల్లో చోటామోటా నాయకుల దాకా కొత్తగా ప్రజలకు రిపబ్లిక్ దినోత్సవంనాడు ఊదర దంచారు. కానీ ఓటు విలువ ప్రజలకు తెలియకకాదు, మంచివాళ్లను ఎన్నుకోవాలనేదే వారి లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని ఆచరణ సాధ్యం కాకుండా చేస్తున్నది అవినీతిపరులైన ‘రాజకీయవేత్తలు–నేరగాళ్లు– నిరంకుశాధికార వర్గ పరస్పర అనుబంధమే’నని మరచిపోరాదు. బహుశా అందుకే శాస్త్రీయ సోషలిస్టు–కమ్యూనిస్టు సిద్ధాంత నిర్మాత అయిన కారల్‌మార్క్స్ ‘ప్రతి అయిదేళ్లకొకసారి ప్రజల నెత్తిమీద ఎక్కి ఎలా తొక్కి దోచుకోవాలో నిర్ణయించుకునేందుకు సంపన్న వర్గాల రాజ కీయ పాలక శక్తులు ఈ ఎన్నికల్ని వినియోగించుకుంటుంటాయ’ని చెప్పిన మాటల్ని మరవరాదు. ‘నన్ను గెలిపిస్తేనే మీకు భవిష్యత్తు, ‘నేను వేయించిన రోడ్లపైనే మీరు నడుస్తున్నారని మరచిపోకండి’, ‘బడిపిల్లలకు నన్ను గురించి పాఠాలు చెప్పాలి’, ‘యూనివర్సిటీలకు ఇచ్చిన గ్రాంట్లను నాకు వాపసు చేయండి’ ‘ఓటర్ల జాబితా నుంచి ప్రత్యర్థి పార్టీల ఓటర్ల పేర్లను తొలగించేందుకు సిద్ధంకండి’– ఇలాంటి చావు తెలివితేటలున్న చంద్రబాబులాంటి నేతల్ని అధికారంలోకి అనుమతించినంతకాలం, డబ్బు సంచులతో దొంగ వ్యాపార ప్రకటనల ద్వారా పాలకులు ప్రోత్సహించే కిరాయి వార్తా పత్రికలున్నంతకాలం జరిగేవి ఎన్నికలూ కావు, ప్రజలు వినియోగించేవి ‘ఓట్లూ’ కావని గుర్తించాలి.
ఆధునిక టెక్నాలజీని, జ్ఞాన తృష్ణను పెంచుకునే సాధనంగా కాకుండా ఓట్లను తారుమారుచేసి, ఓటర్లను ఆటపట్టించే మాధ్యమంగా, వారి తాలూకు వ్యక్తిగత విషయాలపై కూపీ లాగి, బెదిరింపులకు ఒక సాధనంగా వినియోగించి సుమారు 15 కోట్లమంది భారతీయుల కూపీ లాగి అమెరికా వద్ద నిక్షిప్తం చేసి బెదిరింపుల సాధనంగా మార్చిన జుకర్‌బర్గ్ లాంటివాళ్లు మన దేశంలోని కొందరు ఆధునిక రాజకీయవేత్తలకు ‘ఆదర్శమూర్తులు’! ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు పార్లమెంట్ సభ్యులను కోట్లాది రూపాయలకు సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి బొటాబొటిగా ఉన్న తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలుపుకొన్న చంద్రబాబుది ఒక పాలనగా గానీ, అతనొక పాలకుడిగాగానీ, ప్రజా రాజకీయ శాస్త్రం ఒప్పుకోదు. ఈ దేశంలో కొందరు సభాపతుల ప్రవర్తనా అలాగే తయారైంది. ఆమాటకొస్తే అసలు రిపబ్లిక్ రాజ్యాంగాన్ని, దాని వ్యవస్థలనూ పాలకులు భ్రష్టుపట్టిస్తూ నామరూపాలు లేకుండా చేస్తున్నారు. దీనికితోడు పాలకుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సుప్రీంకోర్టును ‘సీల్డు కవర్’ రాజకీయం ద్వారా నోరు నొక్కాలని పాలకులు చూస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ‘‘ప్రజా ప్రతినిధులమని చెప్పుకునే చట్టసభల సభ్యుల అవినీతి ప్రవర్తనకు సంబంధించిన సమాచారం పొక్కకుండా ఎందుకు రక్షణ కల్పించాలి?’’ అని పదే పదే ప్రశ్నించవలసి వస్తోంది.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment