సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు అంశాన్ని రాజకీయం చేయొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సోమవారమిక్కడ మాట్లాడుతూ...జడ్జీల మధ్య వివాదం ముగిసిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ స‍్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించమని, అంతర్గతంగా అందరూ చర్చించుకున్నారని మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.
జడ్జిలందరూ విధులకు హాజరయ్యారని, కోర్టు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నలుగురు జడ్జిలపై ఎలాంటి చర్యలుండవని బీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనితీరు సక్రమంగా లేదంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇవాళ యథావిధిగా విధులకు హాజరు అయ్యారు.
ఇక సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా మీడియా ఎదుట ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment