జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను సత్కరించి జ్ఞాపిక బహూకరిస్తున్న టీడీపీ న్యాయవాదులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. గత ఏడాది నవంబర్ 9న పాట్నా హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన 13 నెలల పాటు ఇక్కడ ఉన్నారు. పదవీ విరమణ అనంతర కార్యక్రమం తరువాత గురువారం రాత్రే ఆయన కుటుంబ సమేతంగా తన స్వస్థలం పాట్నా కు వెళ్లిపోయారు. ప్రతి న్యాయమూర్తి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసే అధికారిక వీడ్కోలు కార్యక్రమాన్ని హైకోర్టు ఈసారి ఏర్పాటు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో న్యాయమూర్తులంతా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు నిర్వహించింది. అయితే తనకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం వద్దని జస్టిస్ రాకేశ్‌కుమారే తిరస్కరించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో న్యాయమూర్తులు జడ్జిల లాంజ్‌లోనే జస్టిస్ రాకేశ్ కుమార్ దంపతులను సత్కరించారు.
తరువాత తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు జస్టిస్ రాకేశ్ కుమార్‌ను ఆయన చాంబర్‌లో ప్రత్యేకంగా కలిసి సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. చివరిగా న్యాయమూర్తులందరూ కారు వరకు వచ్చి జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు వీడ్కోలు పలికారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ కారులో వెళుతూ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అమరావతి రైతుల్ని చూసి కారును స్లో చేసి, కారు తలుపు తీశారు. దీంతో రైతులు ఆయన వద్దకు వెళ్లి కండువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఆయన నవ్వుతూ వాటిని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జనవరి 4న అక్కడ ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment