సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, తమకు అపార గౌరవం ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నొక్కి వక్కాణించారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌరవంగా అమలు చేస్తామని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల మాదిరిగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లమవుతామని అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ఒక న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలకు ఎల్లో మీడియా తనదైన వక్రభాష్యం చెబుతూ కథనాలు అచ్చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యాఖ్యలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఇటీవల ఒక న్యాయమూర్తి కోర్టులో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికలు తొందరగా వస్తాయని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు.
న్యాయమూర్తి వ్యాఖ్యలపై వెంటనే అడ్వొకేట్ జనరల్ స్పందించి.. ఎన్నికలు నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని తేల్చిచెప్పారన్నారు. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగతంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని హైకోర్టుకు ఆయన విన్నవించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, విద్రోహశక్తులకు ఉపయోగపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టుల్లో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలా?
రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని న్యాయమూర్తులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారని మాణిక్యవరప్రసాద్ గుర్తుచేశారు. ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించడంపై సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని చెన్నై కోర్టుకు దిశానిర్దేశం చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఎక్కడో తెలియదని తన కుమార్తె అన్నారని ఇటీవల ఓ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజధాని అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సాగుతోందని, ఈ సమయంలో దానిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
ఆ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి..
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియాకు ఉపయోగపడేలా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాంఛనీయం? సబబు? అని మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. వాటి సాధనలో ఆ పార్టీలే మార్గాలు చూసుకుంటాయని తెలిపారు. వాటికి మీ సహకారం అవసరమా... అనేది ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై న్యాయమూర్తి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి..
Comments
Please login to add a commentAdd a comment