జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు!
న్యూ ఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్‌కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది.
పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్‌ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్‌కే కౌల్‌ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది.