
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో గత ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులు నామమాత్రపు రేట్లకే భూములు తీసుకున్నారు. ఇలా న్యాయమూర్తులు భూములు తీసుకోవచ్చా? తీసుకుంటే ఆ న్యాయమూర్తులు పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన కేసులను నిష్పాక్షికంగా విచారణ జరపగలరా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇది న్యాయవ్యవస్థ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం. దీనిపై వాదనలు వినిపించేందుకు నాకు అవకాశమివ్వండి. కనీసం వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వకపోవడం రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కును హరించడమే అవుతుంది. ఒకవేళ ఈ వ్యాజ్యంపై విచారించడానికి ఇబ్బంది ఉంటే, దానిపై జ్యుడిషియల్ ఆర్డర్ జారీ చేయండి.
తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం’’ అని న్యాయవాది సింహంభట్ల శరత్‌కుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యానికి, తమ ముందున్న రాజధానుల కేసుకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వేరే అంశమని, ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. తొలుత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు.
ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఈ కేసులపై విచారణ ప్రారంభమవడానికి ముందే.. శరత్‌కుమార్ తన కేసును ప్రస్తావించారు. పలుమార్లు తన కేసును ప్రస్తావించినప్పటికీ, వాదనలు వినిపించేందుకు తనకు ఇప్పటివరకు అవకాశం రాలేదన్నారు. న్యాయమూర్తులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ.. తన పిటిషన్‌లోని పలు కీలకాంశాల్లో ఇదొకటని వివరించారు. అయితే ధర్మాసనం ఈ వ్యాజ్యానికీ, తమ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదంది. కనీసం తన వ్యాజ్యం విచారణకు నిర్దిష్టమైన తేదీని ఇవ్వాలని శరత్‌కుమార్ అభ్యర్థించగా.. ధర్మాసనం స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment