సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్‌షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు.
అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది.
ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది.
వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు.
ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్‌షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్‌షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి.
ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు.
ఇతర వివరాలకు 0866–2527124 నంబర్‌లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు.
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
Published Sun, Sep 18 2022 4:51 AM | Last Updated on Sun, Sep 18 2022 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment