Registration price
-
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
రిజిస్ట్రేషన్లు: స్టాంపు డ్యూటీ పెంచే యోచన!
సాక్షి, హైదరాబాద్: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్లో ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ చేసి చూపించడటంతో ఆ శాఖకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబడులు పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువల సవరణతో లేదా స్టాంపు డ్యూటీ పెంపు లేదా రెండు ప్రతిపాదనలను అమలు చేయడం తప్పనిసరి కానుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడం, స్టాంపు డ్యూటీని పెంచకపోవడంతో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నేటికీ 2013 విలువలతోనే... రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏటా భూముల మార్కెట్ విలువలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏడుసార్లు, పట్టణ ప్రాంతాల్లో కనీసం మూడు దఫాలు మార్కెట్ విలువల సవరణ జరగాల్సి ఉంది. సవరణలు జరిగిన ఏడాది ఆగస్టు 1 నుంచి ఆ విలువలు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదు. 2013లో జరిగిన సవరణల విలువల ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల రుసుము వసూలు చేస్తున్నారు. ఇందులో స్టాంపు డ్యూటీ కింద 6 శాతం వసూలు చేస్తున్నారు. ఈ స్టాంపు డ్యూటీని కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెంచలేదు. దీంతో ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 12,500 కోట్లకు పెంచారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టాంపు డ్యూటీ మన పొరుగు రాష్ట్రాల్లో 7 శాతం వరకు ఉంది. దీనికి సమానంగా ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీని పెంచే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు మార్కెట్ విలువల సవరణ తప్పనిసరిగా ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ఈ విలువలు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెంచుతారని సమాచారం. అయితే కేవలం స్టాంపు డ్యూటీ పెంచితే మాత్రం 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వం ఆశించిన మేర వచ్చే ఏడాదికి రెట్టింపు ఆదాయం రావాలంటే మార్కెట్ విలువల సవరణ, స్టాంపు డ్యూటీల పెంపు అనివార్యమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సవరణే... ఉత్తమం.. అయితే స్టాంపు డ్యూటీ పెంపు సాధారణ ప్రజానీకంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్టాంపుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కర్ణాటకలో ఉన్న 5 శాతం ఉన్న స్టాంపు డ్యూటీని 3 శాతానికి తగ్గించారు. మహారాష్ట్రలో కూడా స్టాంపు డ్యూటీ తగ్గించారని అధికారుల ద్వారా తెలుస్తోంది. స్టాంపు డ్యూటీ పెంచితే రుణాలు తీసుకొని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కొనే వారిపై అదనపు భారం పడుతుందని, స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపకరిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ విలువలను సవరించాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఈ విలువలను అవసరమైతే 300 శాతం పెంచినా ప్రజానీకంపై ప్రత్యక్ష భారం ఉండదని, తద్వారా భూముల బహిరంగ విలువలు కూడా తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ వైపే మొగ్గుచూపడం ద్వారా ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. కలవరపెడుతున్న వింతవ్యాధి -
భూసేకరణకు రిజిస్ట్రేషన్ ధరే ఇస్తామంటున్న కలెక్టర్
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలోని విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లనే ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో కలెక్టర్ అహ్మద్ బాబు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై చర్చ జరిగింది. విమానాశ్రయం కోసం సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో ఆ ధరనే ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అందుకు రైతులు వ్యతిరేకించారు. మార్కెట్ ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దాంతో వారిమధ్య అంగీకారం కుదరలేదు. న్యాయపోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు.