సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారి వివరాల కోసం పలు మీడియా సంస్థలకు, సామాజిక మాధ్యమ కంపెనీలకు లేఖలు రాసినట్లు సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఆ లేఖలను సీల్డ్ కవర్‌లో ఉంచామని, వాటిని పరిశీలించాలని సీబీఐ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోర్టును కోరారు. వాటిని తరువాత పరిశీలిస్తామని, ఆ లేఖల కాపీలను పిటిషనర్ (హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్) న్యాయవాదికి అందచేయాలని సుభాష్‌కు హైకోర్టు సూచించింది. న్యాయమూర్తులపై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి రోజూ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో అతడి చిరునామా, ఫోన్ నంబర్, ఈ–మెయిల్, పనిచేసేచోటు తదితర వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టు ముందుంచారు.
లంచ్‌మోషన్ రూపంలో ఈ మెమోలను ఆయన కోర్టుకు సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ ధిక్కార వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిలో పలువురు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్నారని, వారందరికీ నోటీసులు జారీచేశామని చెప్పారు. ఈ వ్యాజ్యంలో యూట్యాబ్, ట్విటర్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ వేసినట్లు రిజిస్ట్రార్ జనరల్ న్యాయవాది అశ్వనీకుమార్ చెప్పారు. దీన్ని అనుమతించాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. సుమోటో ధిక్కార పిటిషన్‌ను, ఇదే అంశంపై రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యంతో కలిపి మంగళవారం వింటామని తెలిపింది.
పోస్టులు పెట్టినవారి వివరాల కోసం లేఖలు
Published Tue, Nov 2 2021 3:37 AM | Last Updated on Tue, Nov 2 2021 3:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment