సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అనుచిత పోస్టులను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా ఆదేశాలకే వక్రభాష్యం చెబుతారా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? కోర్టుతో దాగుడుమూతలు అడుతున్నారా?’ అంటూ నిలదీసింది. జడ్జీలపై పెట్టిన పోస్టులను తీసేయాలని సీబీఐ కోరితే ఎందుకు తీసేయలేదని ప్రశ్నించింది. సీబీఐ కోరిందంటే తమ ఆదేశాల మేరకే అలా కోరినట్లని తేల్చి చెప్పింది.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, సీబీఐ కోరిన విధంగా పోస్టులను తొలగించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏ ఏ యూనిఫాం రీసోర్స్ లోకేటర్ (యూఆర్‌ఎల్)లను తొలగించాలో సోషల్ మీడియా సంస్థల న్యాయవాదులకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కోర్టుకు సైతం వాటిని ఇవ్వాలంది. సీబీఐ ఇచ్చిన యూఆర్‌ఎల్స్‌ను తొలగించి, వాటి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వారు పరారీలో ఉన్నట్లు ప్రకటించి చార్జిషీట్ వేయండి
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఉన్న 17 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. పంచ్ ప్రభాకర్ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, అనుమతులు రాగానే చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విదేశాల్లో ఉన్న వారిని పరారీలో ఉన్నట్లుగా ప్రకటించి చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తాజాగా మరో 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని రాజు చెప్పారు. యూఆర్‌ఎల్స్ సోషల్ మీడియా సంస్థలకు పంపామన్నారు. యూట్యూబ్ 160 యూఆర్‌ఎల్స్‌కు గాను 150 తొలగించిందని తెలిపారు. ట్విట్టర్ స్పందన నామమాత్రంగా ఉందని, 43 యూఆర్‌ఎల్స్‌కు 13 మాత్రమే తొలగించిందని చెప్పారు. ఫేస్‌బుక్ 51 యూఆర్‌ఎల్స్‌కు 31 తొలగించిందన్నారు. కేసుల నమోదు తరువాత జడ్జీలపై పోస్టులు దాదాపుగా లేవనే చెప్పొచ్చన్నారు.
36 గంటల్లో తొలగిస్తామన్నారుగా..
ట్విట్టర్ తీరు మొదటి నుంచీ ఇలానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలిస్తే యూఆర్‌ఎల్స్ ఇచ్చిన 36 గంటల్లో తొలగిస్తామని చెప్పి, ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఎందుకు తొలగించలేదని సోషల్ మీడియా సంస్థల న్యాయవాదులను ప్రశ్నించింది. ట్విట్టర్ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దత్తార్ స్పందిస్తూ, ఐటీ చట్ట నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాలు ఉంటేనే యూఆర్‌ఎల్స్ తొలగించాలన్నారు. రిజిస్ట్రార్ జనరల్ పంపిన వివరాలను కోర్టు ఆదేశాలుగానే భావించి కొన్నింటిని తొలగించామని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
యూఆర్‌ఎల్స్ తొలగింపుపై గత ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా చెప్పామని, ఇప్పుడు వాటికి వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడింది. ఇలా కోర్టుతోనే దాగుడుమూతలు ఆడుతుంటే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలంది. రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా కాకుండా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన యూఆర్‌ఎల్స్ ఆధారంగా సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాస్తోందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగానే వ్యవహరించాలని అన్నారు. రిజిస్ట్రార్ జనరల్ పంపిన యూఆర్‌ఎల్స్‌ను తొలగించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment