ఆ కేసును సీబీఐకి అప్పగించడం ఉత్తమం  | AP High Court Was Of View That It Was Better To Hand Over Blame Case To The CBI | Sakshi
Sakshi News home page

ఆ కేసును సీబీఐకి అప్పగించడం ఉత్తమం 

Published Fri, Oct 9 2020 10:37 AM | Last Updated on Fri, Oct 9 2020 10:37 AM

AP High Court Was Of View That It Was Better To Hand Over Blame Case To The CBI - Sakshi

సాక్షి, అమరావతి : ఇటీవల వివిధ సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వచ్చిన పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడం ఉత్తమమని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. స్వతంత్ర సంస్థ పరిధి విస్తృతమైనది కావడం.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉండటం.. తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని, దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్టు తెలిపింది. అలాగే, సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో, ఆ పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడంపై తమకెలాంటి అభ్యంతరంలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్, సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని, అలాంటి వాటిని ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించదని శ్రీరామ్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు, ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు, పోస్టులు చేసిన వారి వివరాలతో రిజిస్ట్రార్‌ జనరల్‌ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. 

టీడీపీ ఇంప్లీడ్‌ పిటిషన్‌కు నో
అనంతరం.. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేత ఎం.శివానందరెడ్డి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు దర్యాప్తును సీఐడీ కొనసాగించేలా ఆదేశాలివ్వడమా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించడమా? అన్నదే తమ ముందున్న ప్రధాన ప్రశ్న అని.. దీనిపైనే తాము తేలుస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. 

నాకెలాంటి పరిమితుల్లేవు : ఏజీ
ఈ సమయంలో ఏజీ శ్రీరామ్‌.. ఉన్నం మురళీధరరావు వాదనలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు హైకోర్టును ఓ వేదికగా చేసుకుంటున్నారని ఏజీ చెప్పగా, అడ్వొకేట్‌ జనరల్‌గా మీకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుకు సహకరించే విషయంలో తనకెలాంటి పరిమితులు లేవని శ్రీరామ్‌ తేల్చిచెప్పారు.

ఎవ్వరూ కూడా గొంతెత్తడానికి వీల్లేదు : ధర్మాసనం
రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టుల నుంచే పాలన సాగిస్తారా? అంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎవరూ వీధుల్లో గొంతెత్తడానికి వీల్లేదని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. 

అవి సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి : నిరంజన్‌రెడ్డి
ఆ తర్వాత.. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయడంలేదన్న అభిప్రాయానికి రావొద్దని ధర్మాసనాన్ని కోరారు. సీఐడీ సమర్థతను శంకించవద్దని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐ పరిధి విస్తృతమని స్పష్టంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని, అవన్నీ సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయలేదని భావిస్తే, సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలే తప్ప, అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని.. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. హైకోర్టుకూ ఈ తీర్పు వర్తిస్తుందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. న్యాయమూర్తులూ మానవమాత్రులేనని, తప్పులు చేయడం సహజమేనని.. తీర్పు తప్పని భావిస్తే పైకోర్టుకు వెళ్లాలే తప్ప జడ్జీలను దూషించడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో.. దర్యాప్తును ఏ సంస్థకు అప్పగించినా తమకు ఇబ్బందిలేదని.. సీఐడీ సమర్థతను శంకించే రీతిలో ఉత్తర్వులు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఐడీపై ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని ధర్మాసనం స్పష్టంచేసింది.

ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలి : ఏజీ
ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ప్రతీ వ్యవస్థా వారి వారి పరిధిలో పనిచేయాలని, ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని శ్రీరామ్‌ తెలిపారు.  పిటిషనర్‌ న్యాయవాది 151 ఎమ్మెల్యేల సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చినా తమకు అభ్యంతరంలేదని, ప్రభుత్వానికీ ఉండదన్నారు. ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

విజయవాడలోనే సీబీఐ ఆఫీసు తెరవాల్సి ఉంటుంది: హైకోర్టు 
రాష్ట్రంలో పోలీసుల చర్యలపై దర్యాప్తులకు ఆదేశించాలంటే విజయవాడలోనే సీబీఐ ఆఫీసును తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ డైరెక్టర్‌ను పిలిచి సీబీఐ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరేలా రాష్ట్రంలో పరిస్థితులున్నాయంది. పోలీసులు తమ సంబందీకులను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పోలీసుల తరఫున సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్, ఆయన భార్యపై నిరుద్యోగులను మోసం చేసిన ఆరోపణలున్నాయన్నారు. వీరిపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వీరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీనియర్‌ సివిల్‌ జడ్జి నివేదిక చాలా స్పష్టంగా ఉందని, పోలీసులు చేసిన అన్ని పనులను అందులో వివరించారని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement