
♦ దేశంలోని హైకోర్టులలో మహిళా జడ్జీలు 9 శాతమే. మొత్తం 24 హైకోర్టులకు 1,221 మంది జడ్జీల నియామకం జరగగా ప్రస్తుతం 891 మంది జడ్జీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. వాళ్లలో మహిళా జడ్జీల సంఖ్య కేవలం 81.
♦ వారం రోజులుగా ఈజిప్ట్‌లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఫోరమ్ ఫెస్టివల్ భారత కాలమానం ప్రకారం శనివారం ముగిసింది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న దేశీ వనిత, ఆల్ లేడీస్ లీగ్ (ఏఎల్‌ఎల్), విమెన్ ఎకనమిక్ ఫోరమ్‌ల వ్యవస్థాపకురాలు, ఆ సంస్థల గ్లోబల్ చైర్‌పర్సన్ డాక్టర్ హర్‌బీన్ అరోరా ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతే అల్ సిసి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందిన మొదటి భారతీయురాలిగా డాక్టర్ హర్‌బీన్ అరోరా అరుదైన మరో గౌరవానికీ పాత్రులయ్యారు.
♦ ‘‘ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ, అవకాశాలను ఉపయోగించుకొని క్షేమంగా మనిషిని అంతరిక్షంలోకి పంపగలం.. అంతే సురక్షితంగా తిరిగి భూమికి రప్పించగలం’’ – ఇస్రోలోని హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వీఆర్ లలితాంబికా నోట ఆమె ఆత్మవిశ్వాసం పలికించిన మాట ఇది. మైసూరు పట్టణంలో శుక్రవారంనాడు స్వదేశీ విజ్ఞాన ఆందోళన కర్ణాటక సంస్థ నిర్వహించిన పదకొండో నేషనల్ విమెన్స్ కాంగ్రెస్ సదస్సులో ‘మేరీ క్యూరీ మహిళా విజ్ఞాన పురస్కారం’’ అవార్డుతో లలితాంబికను సత్కరించారు. ‘ఎనాబ్లింగ్ మదర్‌హుడ్ అండ్ ఎనేబ్లింగ్ విమెన్ ఫర్ లీడర్‌షిప్ ఇన్ సైన్స్’ థీమ్‌తో ఈ సదస్సు సాగింది.
న్యాయస్థానాల్లో జడ్జీలుగా స్త్రీలు తొమ్మిది శాతమే ఉన్నా.. ఇంకోచోట హైరార్కీలో పన్నెండు శాతమే ఉన్నా.. స్పేస్ చాలెంజెస్‌లోనూ విజయం సాధిస్తామని చెప్పే ఆడవాళ్లూ తక్కువే అయినా.. అసలంటూ ఉన్నారు. ఆ ఉనికి చాలు.. మిగిలిన మహిళలు స్ఫూర్తిగా తీసుకొని రాశి పెరగడానికి... అవకాశాలు రావడానికి!
Comments
Please login to add a commentAdd a comment