సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సాఫీగా, వేగవంతంగా సాగేందుకు వీలుగా హైకోర్టులో ధర్మాసనాలను, ఆయా న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టులను మారుస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు నాలుగు ధర్మాసనాలుండగా.. వాటిని మూడుకు కుదించారు. మొదటి ధర్మాసనానికి ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి నేతృత్వం వహిస్తారు. రెండో ధర్మాసనం.. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌వీ భట్, జస్టిస్ మంతోజ్ గంగారావు నేతృత్వంలో పనిచేస్తుంది. మూడో ధర్మాసనానికి న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ జవలాకర్ ఉమాదేవి నేతృత్వం వహిస్తారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. చట్టాలను, చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను విచారిస్తుంది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, హెబియస్ కార్పస్ పిటిషన్లు, పర్యావరణం, కాలుష్యం సంబంధిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్ అప్పీళ్లను, ఉరిశిక్ష ఖరారు వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది. ఇక ఎస్‌వీ భట్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐటీ ట్రిబ్యునల్ అప్పీళ్లు, ఐటీ కేసులు, సెంట్రల్ ఎక్సైజ్ కేసులు, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను, జీఎస్‌టీ, డీఆర్‌టీ తదితర చట్టాలను సవాలు చేస్తూ దాఖలయ్యే కేసులను విచారిస్తుంది. జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం.. ఉద్యోగుల సర్వీసు వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు, సర్వీసు చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది.
ఏ ఏ కేసులు.. ఎవరు విచారిస్తారంటే..
ఇక సింగిల్ జడ్జిలుగా జస్టిస్ మంథాట సీతారామమూర్తి.. పురపాలక, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సమాచార హక్కు చట్టం తదితర విషయాలకు సంబంధించిన కేసులపై విచారణ జరుపుతారు. జస్టిస్ ఉమ్మాక దుర్గాప్రసాద్‌రావు.. పంచాయతీరాజ్, భూసేకరణ, పౌర సరఫరాలు, వ్యవసాయం, నీటి పారుదలశాఖ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. అలాగే కంపెనీ పిటిషన్లు, కంపెనీల అప్పీళ్లపై కూడా విచారణ జరుపుతారు. జస్టిస్ తాళ్లూరు సునీల్‌చౌదరి.. 2009 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు (ఏసీబీ, సీబీఐతో సహా) విచారిస్తారు. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్.. విద్యా, యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాంఘిక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు, వైద్య, ఆరోగ్యం తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. జస్టిస్ తేలప్రోలు రజనీ.. బెయిల్, క్రిమినల్ పిటిషన్లతో పాటు 2008 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై (ఏసీబీ, సీబీఐ సహా) విచారణ జరుపుతారు. జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు.. సివిల్ రివిజన్ పిటిషన్లు, సెంకడ్ అప్పీళ్లు తదితరాలను విచారిస్తారు. జస్టిస్ కొంగర విజయలక్ష్మి.. హోం, గనులు, పరిశ్రమలు, రవాణా, దేవాదాయ, ఎక్సైజ్, జీఏడీ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. ఈ ఏర్పాట్లు ఈ నెల 21వ తేదీ నుంచి తదుపరి మార్పులు చేసేంత వరకు అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యే నాటికి 14 మంది న్యాయమూర్తులుండగా.. ఈ నెల 14న జస్టిస్ బాలయోగి పదవీవిరమణ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్ర హైకోర్టులో దాదాపు 1.90 లక్షల వరకు పెండింగ్ కేసులుండే అవకాశం ఉంది. ఇంత తక్కువ మంది న్యాయమూర్తులు ఈ స్థాయి కేసులను విచారించడం చాలా కష్టం. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకుంటే ప్రస్తుత ఉన్న 13 మంది న్యాయమూర్తులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మూడు ధర్మాసనాలు.. ఏడుగురు సింగిల్ జడ్జిలు
Published Fri, Jan 18 2019 2:30 AM | Last Updated on Fri, Jan 18 2019 2:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment