సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మరో న్యాయాధికారిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. ఆయన సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఏసీబీ ప్రత్యేక బృందాలు సరూర్‌నగర్ గడ్డిఅన్నారం, కొండాపూర్ ఇజ్జత్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. అలాగే హైదరాబాద్ నగరంలో మరో నాలుగు చోట్ల, సిరిసిల్లలోని మూడు ప్రాంతాలు, మహారాష్ట్రలో రెండు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. వరప్రసాద్ భారీ ఖర్చుతో తన కుటుంబ సభ్యులతోసహా పలుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన చేసిన భారీ ఖర్చులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సేకరించింది. రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. వీటి మార్కెట్ విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
అనుమతిలేకుండా ప్రెస్‌మీట్!
ఇటీవల తెలంగాణ న్యాయాధికారుల విభజన వ్యవహారంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకే ఈ దాడి జరిగిందన్న ప్రచారాన్ని హైకోర్టు వర్గాలు తోసిపుచ్చాయి. గత మూడు నెలలనుంచి వరప్రసాద్ ఆస్తులపై ఏసీబీ విచారణ చేస్తోందని, ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే వరప్రసాద్‌పై కేసు నమోదుకు ప్రధాన న్యాయమూర్తి అనుమతినిచ్చారని ఆయా వర్గాలు తెలిపాయి. ఏసీబీ విచారణ గురించి తెలుసుకున్నాకే సానుభూతి కోసం ఆయన విలేకరుల సమావేశంలో న్యాయాధికారుల విభజన అంశంపై మాట్లాడారని, విలేకరులతో మాట్లాడేందుకు ఆయన హైకోర్టు అనుమతి కూడా తీసుకోలేదని ఆ వర్గాలు చెప్పాయి.
మూడు నెలలుగా ఆధారాల సేకరణ
వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు మూడు–నాలుగు నెలల క్రితం హైకోర్టుకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించాలని ఏసీబీని ఆదేశించింది. ఆదాయానికి మించి ఆయన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టు ముందు ఉంచింది. సాక్ష్యాధారాలపై సంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు వరప్రసాద్‌పై కేసు నమోదుకు అనుమతినిచ్చింది. ఏసీబీ కేసు నమోదుచేసిన నేపథ్యంలో వరప్రసాద్‌ను త్వరలో హైకోర్టు సస్పెండ్ చేయనుంది.
ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..: కొండాపూర్‌లో రూ.53 లక్షలు విలువ చేసే ఫ్లాట్, దిల్‌సుఖ్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో రూ.12.63 లక్షల ఫ్లాట్, అక్కడే రూ.5.68 లక్షల విలువ చేసే ఫ్లాట్, పలు బ్యాంకుల్లో రూ.38.16 లక్షల డబ్బు, రూ.14 లక్షల విలువచేసే హోండా సిటీ కారు, రూ.5.13 లక్షల విలువ చేసే ఐ10 కారు, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంటిలో వస్తువులు రూ.2.61 లక్షలు, కొండాపూర్ ఇంటిలో రూ.9.80 లక్షల విలువైన వస్తువులు.
తొమ్మిది నెలల్లో నాలుగో కేసు..
గత 9 నెలల్లో న్యాయాధికారులపై ఏసీబీ నమోదు చేసిన నాల్గవ కేసు ఇది. ఈ మార్చి, ఏప్రిల్‌ల్లో న్యాయాధికారులు మధు, మల్లంపాటి గాంధీ, ఎస్.రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లంచం అడిగిన కేసులో మధు, రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదుచేయగా, గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేసు నమోదైంది. వీరందరినీ కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment