
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన శ్రీవారి రథోత్సవానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల : పవిత్రమైన వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లలో తొలిసారిగా టీటీడీ ఘోరంగా విఫలమైంది. వీఐపీలకు అడుగడుగునా మర్యాదలు చేయగా.. సామాన్యులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. సర్వదర్శన క్యూలైన్లలో తోపులాటలతో భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై భక్తులు విరుచుకుపడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వీఐపీలకు ఏకాదశి దర్శన టికెట్లు, స్వామి దర్శనం కల్పించటంలో టీటీడీ ఉన్నతాధికారులు పెద్దపీట వేశారు. మొత్తం 3,563 టికెట్లు కేటాయించారు. వీరందరికీ ఉ.4గం.ల నుండి 8గం.ల వరకు స్వామివారి దర్శనం కల్పించారు.
వీఐపీ హోదాను బట్టి నిరీక్షణ, హారతులు, తీర్థం, శఠారి, ఇతర ప్రత్యేక మర్యాదలు కల్పించారు. దీంతో వీరికే 4 గంటల సమయం పట్టింది. గత ఏడాది వీఐపీలకు 4200 టికెట్లు కేటాయించినా రెండున్నర గంటల్లోనే దర్శనాలు ముగించి సామాన్యులకు త్వరగా దర్శనం కల్పించారు.
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సంతాన గౌడర్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామలింగేశ్వరరావు, జస్టిస్ ఎ.శంకర్ నారాయణ, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ నాగార్జునరెడ్డి, అమర్‌నాథ్ గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, జస్టిస్ నూతి రామ్మోహన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
–సాక్షి, తిరుమల