సాక్షి, అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం..
ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. గతంలోనూ చాలా మంది రాశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేఖను బహిర్గతం చేయడంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, జోసెఫ్ మరొకరు మీడియా ముందుకు వచ్చి రోస్టర్ విషయంలో నాటి ప్రధాన న్యాయమూర్తి పారదర్శకంగా వ్యవహరించడం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు.
ఆయన ఎవరో అందరికీ తెలుసు..
2004–05లో ఇంగ్లాడ్ బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..?
ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే ఓ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరుపుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా?
బాధతోనే సీఎం స్పందించారు..
ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి స్పందించి సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. లోతుగా విచారణ జరిపి ఆరోపణలకు ఆస్కారం రాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి.
హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు...
ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత దర్యాప్తు పూర్తి చేయాలి. అది ఆపడానికి వీల్లేదు. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చింది. అలా చేసి ఉండాల్సింది కాదు.
నియామకాల్లో పారదర్శకత ఉండాలి..
న్యాయవ్యవస్థలో చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత ఉండాలి. అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి.
ఇష్టానుసారంగా నిందలు సరికాదు...
న్యాయమూర్తుల బెంచ్ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని వ్యాఖ్యానించడంపై సీజేకు ఫిర్యాదు వెళ్లింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు?
ఆ లేఖలు.. మక్కీకి మక్కీ
జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేయడం సంచలనం రేకెత్తించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష.
Comments
Please login to add a commentAdd a comment