
సాక్షి, భోపాల్: ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు కలిగి ఉన్నందుకు ఇద్దరు జడ్జీలపై వేటు పడింది. మధ్యప్రదేశ్ హైకోర్టు వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండకూడదనే రాష్ట్రప్రభుత్వ నిబంధనను అతిక్రమించినందుకు గాను, కింది స్థాయి కోర్టులకు చెందిన ఇద్దరు ట్రైనీ జడ్జీలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్(జనరల్ కండీషన్ ఆఫ్ సర్వీసెస్) నిబంధనలు 1961ను సవరించిన ఆ రాష్ట్రప్రభుత్వం, 2001 జనవరి 26 తర్వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మూడో సంతానాన్ని కలిగి ఉంటే, వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ నిబంధనలు అతిక్రమించినందుకు గాను, గౌలియర్‌లో అదనపు జిల్లా సేవల(ట్రైనీ) జడ్జీ మనోజ్ కుమార్, జబల్పూర్‌కు చెందిన జిల్లా అదనపు(ట్రైనీ) జడ్జీ అష్రఫ్ అలీలను విధుల నుంచి తొలగిస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మహమ్మద్ ఫహిమ్ అన్వర్ తెలిపారు. వీరి తొలగింపుపై హైకోర్టు జడ్జీలందరూ సమావేశమైన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైకోర్టు ఈ మేర చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి.
జనాభాను తగ్గించడానికి అసోం ప్రభుత్వం కూడా ఈ ఏడాది మొదట్లో ఇదే రకంగా ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ అసోం ప్రభుత్వం కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతేకాక యూనివర్సిటీ స్థాయి వరకు ఆడపిల్లలకు ఉచిత విద్యను కూడా అసోం ప్రభుత్వం అందిస్తోంది. ఈ జనాభా పాలసీ డ్రాఫ్ట్‌ను అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిస్వా శర్మ ప్రకటించారు. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే, వారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారని చెప్పేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు టూ-చైల్డ్ పాలసీని అమలుచేస్తున్న రాష్ట్రాల్లో అసోం 12వది.