![AP High Court Judge Justice Manmadharao says lawyers to become judges - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/3/justice.jpg.webp?itok=4Bu7qfJz)
జస్టిస్ మన్మథరావును సన్మానిస్తున్న న్యాయవాదులు
కందుకూరు: వృత్తిలో సవాళ్లు, ఒత్తిడిలను అధిగమించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా సాధారణ న్యాయవాదులు సైతం న్యాయమూర్తులుగా ఎదగవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడికి హైకోర్టు న్యాయమూర్తి పదవి దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ.. కందుకూరు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కందుకూరు కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
31 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో పనిచేసిన తరువాత తనకు న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టుల్లో అవకాశాలు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో న్యాయమూర్తిగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. బార్ అసోసియేషన్లు కేవలం కోర్టు విధులు, కోర్టుల్లో సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని మన్మథరావు కోరారు. నేడు కోర్టులే ప్రజల వద్దకు వస్తుంటే.. బార్ అసోసియేషన్లు ప్రజల వద్దకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి, సీనియర్ సివిల్ జడ్జి విజయబాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment