కలకత్తానే ముద్దు.. కోల్కతా వద్దు
కోల్కతా: బాంబే, మద్రాస్, కలకత్తా హైకోర్టుల పేర్లను ముంబై, చెన్నై, కోల్కతా హైకోర్టులుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కలకత్తా హైకోర్టు పేరును కోల్కతాగా మార్చవద్దంటూ ఆ కోర్టులో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కలకత్తా హైకోర్టు పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జడ్జీలందరూ ఓ తీర్మానాన్ని చేసి, దానిని కేంద్ర న్యాయ శాఖకు పంపారు.
భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు అయిన కలకత్తా హైకోర్టుకు 154 ఏళ్ల చరిత్ర ఉందని, కలకత్తా పేరును స్థానికులు సెంటిమెంట్ గానూ భావిస్తారని పైగా షిప్పింగ్, బ్యాంకింగ్ ఇంతర వ్యాపారాలకు సంబంధించిన వివాదాల్లో ప్రపంచ దేశాలకు ఇది(కోర్టు) కలకత్తా హైకోర్టుగానే పరిచయమని లా సొసైటీ ఆఫ్ కలకత్తా (ఐఎల్ఎస్ సీ) అధ్యక్షుడు ఆర్కే ఖన్నా అంటున్నారు. ఏ రకంగా చూసినా హైకోర్టు పేరు మార్పు తగదని, అందుకే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఖన్నా తెలిపారు.
ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే మూడు హైకోర్టుల పేర్లను మార్చేశారు అధికారులు. కలకత్తా హైకోర్టు వెలుపల 'కోల్ కతా' హైకోర్టు అని బెంగాలీలో బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ ఇంగ్లిష్ పేరు మాత్రం కలకత్తా హైకోర్టుగానే ఉంచారు. హైకోర్టుల పేర్ల మార్పుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని, తాము సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లేది, లేనిది రాష్ట్రపతి నిర్ణయం తర్వాత స్పష్టత వస్తుందని జడ్జిలు చెబుతున్నారు.