ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
దేశ సర్వోన్నత న్యాయస్థానం 44వ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖేహర్ ఈ నెల 27న(ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. సిక్కు మతస్థుల నుంచి ఈ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను సాధించారు. ఈ ఏడాది జనవరి 4న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, 2011 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఉత్తరాఖండ్, కర్ణాటక హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలను నిర్వహించారు. 2జీ కుంభకోణం కేసులో, సహారా సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్ కేసులో కీలక తీర్పులిచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం విరమించుకునేలా ఆయన తీర్పునిచ్చారు. తాజాగా ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసులో మెజారిటీ తీర్పును (3 ః 2 నిష్పత్తితో) విభేదిస్తూ మైనారిటీ తీర్పును వెలువరించారు. ఈ ఆచారాన్ని గత 1,400 ఏళ్లుగా ఆచరిస్తున్నందున, దీనిలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని, ఆరునెలల్లోగా తగిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాజకీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలంటూ తమ తీర్పులో సూచించారు.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల సీనియారిటీలో మూడోస్థానంలో ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీగా పదోన్నతి పొందడానికి ముందు గువహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. ఎవరైనా ఈ–మెయిల్స్ లేదా ఎలక్ట్రానిక్ మెసేజ్‌లలో పెట్టే పోస్టుల ద్వారా సంబంధిత వ్యక్తులను అసౌకర్యానికి, కోపానికి గురిచేస్తే వారిని పోలీసులు అరెస్ట్ చేసే హక్కును కల్పించే ఐటీ యాక్ట్ లోని 66 (ఏ) సెక్షన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిగా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా 2018 జూన్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే
బొంబాయి హైకోర్టు జడ్జీగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాక 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆధార్ కార్డు లేని కారణంగా దేశ పౌరుడికి ఎవరికి కూడా ప్రాథమిక, ప్రభుత్వ సేవలను నిరాకరించరాదంటూ 2015లో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన స్పష్టీకరణలో బోబ్డే భాగస్వామిగా ఉన్నారు.
జస్టిస్ ఆర్‌కే అగర్వాల్
2013 అక్టోబర్‌లో మద్రాసు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఆర్‌కే అగర్వాల్ నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్
1979లో న్యాయవాదిగా తమ కెరీర్‌ను ప్రారం భించిన ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పలు కేసులను వాదించారు. 2011 జూలై 27–2013 ఫిబ్రవరి 4 మధ్యకాలంలో భారత సోలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2014 జూలై 7న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికప్పుడు ఇచ్చే విడాకులు (ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జీల్లో ఒకరిగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచే పోస్టులపై దాఖలైన పిటిషన్‌లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఏ)ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన ఇద్దరు జడ్జీల్లో ఈయన ఒకరు.
జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
మణిపూర్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన అనంతరం 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్
మానవహక్కుల విషయంలో చంద్రచూడ్ నైపుణ్యతను సాధించారు. బొంబాయి హైకోర్టు జడ్జీగా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. గతంలో పంజాబ్, హరియాణా, మద్రాస్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానూ విధులు నిర్వర్తించారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్మెఫ్ హుస్సేన్ వేస్తున్న పెయింటింగ్‌లలో అశ్లీలత ఉందంటూ 2008లో దాఖలైన పిటిషన్‌ను కౌల్ తిరస్కరించారు.
జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
1958లో కర్ణాటకలోని మూడ్‌బిద్రీలో జస్టిస్ నజీర్ జన్మించారు. బీకామ్ ఆ తర్వాత న్యాయశాస్త్ర పట్టాను పొందాక 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉన్నపళంగా 3 పర్యాయాలు తలాక్ (ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్) చెప్పడం చట్టవిరుద్ధమంటూ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ చీఫ్ జస్టిస్ ఖేహర్ ఇచ్చిన మైనారిటీ తీర్పుతో జస్టిస్ నజీర్ ఏకీభవించారు.
చరిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వీరే...
Published Fri, Aug 25 2017 4:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement