సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా! | Judges are deeply dissatisfied with Revanth Reddy response in the case of Kavitha bail | Sakshi
Sakshi News home page

సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా!

Published Fri, Aug 30 2024 3:21 AM | Last Updated on Fri, Aug 30 2024 3:21 AM

Judges are deeply dissatisfied with Revanth Reddy response in the case of Kavitha bail

కవిత బెయిల్‌విషయంలో రేవంత్‌రెడ్డి స్పందనపై జడ్జీల తీవ్ర అసంతృప్తి

ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడగలరు?

రాజకీయ పార్టీలతో సంప్రదించి ఆదేశాలు ఇవ్వాలా?

న్యాయమూర్తులను అవమానించేలా ప్రకటనలు చేయకూడదు 

అలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చు

ధైర్యం ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే విచారణ మరెక్కడైనా జరగనివ్వండి

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ వ్యాఖ్యలు

ఓటుకు కోట్లు కేసును విచారించిన త్రిసభ్య ధర్మాసనం 

కొత్తగా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని స్పష్టీకరణ

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 2కు వాయిదా  

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరుపై స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చని వ్యాఖ్యానించారు. 

సీఎం రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు హైదరాబాద్‌ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ, బీఆర్‌ఎస్‌ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మొహమ్మద్‌ అలీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 

ఈ కేసుకు సంబంధించి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిలు వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు.

మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం
‘సుప్రీంకోర్టు తీర్పులపై వచ్చే విమర్శలు పట్టించుకోబోం. మాకెలాంటి ఇబ్బందీ లేదు. మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేం నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. 

ఆ తరహా ప్రకటనలు ఎలా చేయగలరు? రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకూ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే.. కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి..’ అంటూ జస్టిస్‌ గవాయి ఘాటుగా వ్యాఖ్యానించారు.
 

పదే పదే అలాంటి వ్యాఖ్యలా?
‘ఆ తరహా వ్యాఖ్యలు..మళ్లీ గురువారం ఉదయం కూడా! బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఈ తరహా స్టేట్‌మెంట్లు ఇవ్వడాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టుపై ఆక్షేపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటనేనా ఇది? న్యాయవ్యవస్థకు ఆమడ దూరంలో ఉండడమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి.. కానీ ఆక్షేపణలు వద్దు..’ అని జస్టిస్‌ విశ్వనాథన్‌ స్పష్టం చేశారు.

అలాగైతే న్యాయాధికారులపై విశ్వాసం లేనట్లే అవుతుంది..
‘ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్లు విచారణకు స్వీకరిస్తే న్యాయాధి కారులపై కోర్టుకు విశ్వాసం లేనట్లే అవుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. చట్టసభల్లో జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతుంటాం. వారికీ ఇది వరిç్తÜ్తుంది..’ అని జస్టిస్‌ గవాయి పేర్కొన్నారు. 

దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది
వ్యాఖ్యల సవరణకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ వాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. అయితే జరగా ల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు దిగువ కోర్టులకూ వ్యాపించే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సి.సుందరం పేర్కొన్నారు. 

రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం కావడంతో పాటు ఏసీబీని కూడా తన అధికార పరిధిలో ఉంచుకున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదని అన్నా రు. దర్యాప్తు అధికారులు కూడా మారారని చెప్పా రు. గతంలో దాఖలు చేసిన కౌంటరుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసులపై కూడా రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అని, ఏ వ్యక్తీ తన సొంత విషయంలో న్యాయ మూర్తి కాకూడదనే సహజ న్యాయసూత్రం గుర్తుచేశారు. 

న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలి
ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మా సనం.. స్వతంత్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమిస్తే దర్యాప్తుపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తుపై స్టే ఇచ్చిన అంశం, సీబీఐకి బదిలీ తదితర అంశాలపై ఆరా తీసింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంపై తెలంగాణకు చెందిన సహచరులను సంప్రదిస్తామని తెలిపింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని, అయితే ప్రస్తుత పిటిషన్‌ను కొట్టివేస్తామని పేర్కొంది. 

న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అందరికీ విశ్వాసం కలిగేలా నియామకం చేపడతామని జస్టిస్‌ గవాయి చెప్పారు. ప్రస్తుత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేంద్రరావుతో పాటు మరో న్యాయవాది ఉమా మహేశ్వరరావు ఉత్తమమని భావిస్తున్నామ న్నారు. అయితే తమకు పోలీసు అధికారుల విషయంలో ఆందోళన ఉందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్‌ న్యాయవాది శేషా ద్రినాయుడు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement