సాక్షి, ఢిల్లీ: మణిపూర్ ఘటనలపై విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్‌లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్‌లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా - సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు.
► ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది.
► సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ Dattatray ‘Datta’ Padsalgikar (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది.
► సీబీఐకి ట్రాన్స్‌ఫర్ కాని కేసుల్ని 42 సిట్‌లు విచారణ చేపడతాయి. ఈ సిట్‌లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్‌లను చూసుకుంటారు అని తెలిపింది.
అంతకు ముందు.. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎఫ్‌ఐఆర్‌ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. మణిపూర్ హింసపై దర్యాప్తునకు ఆరు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. బయట నుంచి కాకుండా.. సిట్‌లను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయించి దర్యాప్తునకు అనుతించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం తమ ప్రతిపాదనకే మొగ్గు చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment