సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు.
అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు.
దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు.
ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం
పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment