
జడ్జిలకు సన్మానం
అనంతపురం మెడికల్ : నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాల్‌లో సోమవారం రాత్రి పలువురు జడ్జిలకు ‘స్నేహ’ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇటీవల జిల్లా జడ్జిగా ఉద్యోగ విరమణ చేసిన కిష్టప్పతో పాటు అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉంటూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన రామచంద్రుడు, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న కుమార్తె జ్యోతిలకు అభినందనలు తెలియజేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్నేహ క్లబ్ జిల్లా గవర్నర్ రామాంజనేయులు, మాజీ గవర్నర్ క్రిష్ణమూర్తి, ఎస్కేయూ ప్రొఫెసర్ బాల సుబ్రమణ్యం, ఏఆర్ ఎస్‌ఐ నీలకంఠప్ప మాట్లాడారు. డిప్యూటీ మేయర్ గంపన్న, స్నేహ క్లబ్ సభ్యులు బాలనరసింహులు, వన్నూరప్ప, ప్రకాశ్‌బాబు, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.