![It's a Black Day for our judiciary: Ujjwal Nikam on SC judges' press meet - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/12/pressmeet%20-2.jpg.webp?itok=GgPIxibG)
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నలుగురు సీనియర్ న్యాయవాదులు నిర్వహించిన మీడియా సమావేశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు పనితీరు బాగా లేదంటూ తొలిసారి బహిరంగంగా సుప్రీం చీఫ్‌పై విమర్శలకు దిగడం కలవరం పుట్టిస్తోంది. దీనిపై పలువురు న్యాయనిపుణులు, ఇతర ప్రముఖులు స్పందించారు.
ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది: సుప్రీం జడ్జిల పట్ల తన కృతజ్ఞత వ్యక్తం చేసిన ఆయన సుప్రీం చీఫ్ దీపక్ మిశ్రా చాలా ఘోరంగా తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి 'రోస్టర్ ఆఫ్ మాస్టర్' గా తన పవర్‌ను వాడుకున్నారని విమర్శించారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం: న్యాయవ్యవస్థకు ఇదొక బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ ప్రతిష‍్టకు భంగం కలిగేలా సుప్రీం న్యాయవాదులు మాట్లాడారు. ఇకపై సామాన్య పౌరుడు కూడా ప్రతీ తీర్పును అనుమానించే అవకాశం ఉంది. ప్రతీ తీర్పు ప్రశ్నించబడుతుంది.
సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి: వారిని విమర్శించలేమనీ, గొప్ప సమగ్రత గల వ్యక్తులు, చట్టపరమైన వృత్తిని త్యాగం చేశారంటూ న్యాయమూర్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు.
సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి: ఇది తనను చాలా షాక్‌కు గురిచేసింది.సీనియర్ అధిక న్యాయమూర్తులకు ఈ చర్య వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయని, వారు మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాలపై బాధ కనిపించింది. ప్రధాన న్యాయమూర్తి తక్షణమే రాజీనామా చేయాలి.
కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ : అంతిమంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమూర్తులు తమలో తాము సమస్యలను పరిష్కరించుకొని వుంటే బావుండేది.
మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్: ఈ అంశంపై స్పందిస్తూ పార‍్లమెంటు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్, సుప్రీంకోర్టే న్యాయమూర్తులను నియమిస్తుందన్నారు. అలాగే నలుగురు న్యాయవాదులు మీడియా ముందుకు రాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు.
ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్: న్యాయమూర్తుల ప్రెస్‌మీట్‌ను సమర్ధించారు. బయటకు వచ్చిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకులు కాదనీ, కానీ కొల్లీజియంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు వుంటుందన్నారు.
రిటైర్డ్ జస్టిస్ ఆర్ సోధి: ఇది పరిపాలనా అంశంపై విమర్శ. ఇపుడు బయటికి వచ్చింది కేవలం నలుగురే, ఇంకా 23 మంది ఉన్నారు. అపరిపక్వత, పిల్లతనం తప్ప మరోటి కాదంటూ నలుగురు న్యాయమూర్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారెలా చెబుతారు. మనకు పార్లమెంటు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి.
మరోవైపు ఇదే అంశంపై సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ నివాసంలో ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment