సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, దీనిని అందరూ అంగీకరించి తీరాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తాను సీజేగా బాధ్యతలు చేపట్టి నెల రోజులే అవుతోందని, కాబట్టి న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి అర్హులైన న్యాయవాదుల పేర్లను సిఫారసు చేసే విషయంలో కొంత సమయం పడుతుందని తెలిపారు. ఖాళీల భర్తీకి కృతనిశ్చయంతో ఉన్నామని, కొన్ని సందర్భాల్లో తొందరపడితే మొత్తం వ్యవహారం చెడిపోతుందని సీజే వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి రావాలనుకుంటున్నారా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఖాళీల భర్తీ విషయంలో కొంత కాలం వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. తదుపరి విచారణను నెల రోజులకు వాయిదా వేశారు. ఈ మేరకు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ రాజ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించారని, అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేసులు సకాలంలో పరిష్కారం కాకపోవడానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం ఒక్కటే కారణం కాదని, న్యాయవాదులు సైతం పదే పదే వాయిదాలు కోరడం కూడా ఓ కారణమని పేర్కొంది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సానుకూల దృక్పథంతో ఉండాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment