నోట్ల రద్దుకు నిరసనగా భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈనెల 28వ తేదీన భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దాదాపు 13 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మరింత ఉధృతంగా చేయాలని ప్రతిపక్షాలు తీర్మానించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రధానమంత్రి మాట్లాడాలని పార్లమెంటు లోపల, బయట విపరీతంగా డిమాండు పెరుగుతున్నా ఆయన మాత్రం మౌనాన్నే ఆశ్రయించడాన్ని నిరసిస్తూ 13 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలు ఈ నిరసనలలో పాల్గొన్నాయి.
ఇక తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జంతర్ మంతర్ వద్ద పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొని.. పెద్ద నోట్ల రద్దుపై పోరాటాన్ని తాము మరింత తీవ్రంగా కొనసాగించి తీరుతామని చెప్పారు. ప్రజాగ్రహంలో మోదీ సర్కారు కొట్టుకుపోతుందని ఆమె మండిపడ్డారు. రైతులు తాము ఇన్నాళ్లూ దాచుకున్న మొత్తాన్ని కోల్పోతున్నారని, వాళ్లు ఎలా బతకాలని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లడబ్బు మాటేం చేశారని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిరేటుతో సాగుతున్నప్పుడు.. ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మందగమనంలో పడిందని మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించరని అన్నారు.
అయితే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం పెద్దనోట్ల రద్దును సమర్థించారు. దీనిపై చర్చ జరగనివ్వాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం సభను నడవనివ్వడం లేదన్నారు. యావద్దేశం పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని సమర్థిస్తోందని ఆయన చెప్పారు.