ఛత్తీస్‌గఢ్ రోడ్డు పక్కన మావోయిస్టుల వాల్ పోస్టర్లు (ఇన్‌సెట్) కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక బలగాలు (ఫైల్)
సాక్షి, కొత్తగూడెం: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ నుంచి మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో, ఏవోబీలో మావోయిస్టులు పలుచోట్ల సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెల గ్రామం సమీపంలో వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సును మంగళవారం రాత్రి మావోయిస్టులు తగులబెట్టారు.
ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం నుంచి భద్రాచలం ఏజెన్సీ పరిధిలో బస్సు సర్వీసులన్నింటినీ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ఏజెన్సీ వాసులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాల చోదకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటైంది. చర్ల బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అట్ట పెట్టె వదిలి వెళ్లారు. అందులో బాంబు ఉందేమోనన్న అనుమానాలతో కలకలం బయల్దేరింది. అది ఖాళీ పెట్టె మాత్రమేనని పోలీసులు తేల్చడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. గత మే నెలలో ఇదే చర్ల బస్టాండ్‌లో ఓ బ్యాగులో ప్రెషర్ బాంబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. దానిని పోలీసులు స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. అందుకే, ఇప్పుడు ఆ అట్ట పెట్టె కనిపించగానే అందరూ కలవరపడ్డారు.
అదనపు బలగాల కూంబింగ్...
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అదనపు బలగాలు సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టాయి. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతికరేకంగా మావోయిస్టులు పోరును ఉధృతం చేసే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు భద్రాచలం ఏజెన్సీ దాటి వచ్చి గోదావరికి ఇవతల వైపు ఉన్న మండలాల్లోనూ బంద్‌పై బ్యానర్లు, పోస్టర్లు వేశారు. మంగళవారం గుండాల, శంభునిగూడెం, నర్సాపురం తండ, లింగగూడెం, రోళ్లగడ్డ, సాయనపల్లి గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు పడ్డాయి. మణుగూరు మండలంలో మావోయిస్టులు సోమవారం రాత్రి సంచరించారన్న వార్తలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథ తదితర పనులు సాగుతున్నాయి. అక్కడ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏఎస్పీ(ఆపరేషన్స్) పర్యటించి, పోలీసులకు సూచనలు చేశారు. మణుగూరు మండలంలోని ఇసుక రీచ్‌ల వద్దకు మావోయిస్టుల వచ్చే అవకాశముందని ఇంటెలిజెన్స్ సమాచారమిచ్చింది. దీంతో, ఆ ఇసుక రీచ్‌ల వద్దనున్న వాహనాలను పోలీసులు బయటకు పంపించారు. ఈ నెల 25న భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై మావోయిస్టులు పోస్టర్లు వేశారు. ఇటీవలి కాలంలో గోదావరి దాటి మావోయిస్టులు ఇవతలకు రాకుండా పోలీసు యంత్రాంగం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో గుండాల, అశ్వాపురం మండలాలతోపాటు కీలకమైన భద్రాచలం పట్టణంలోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బస్టాండులోనూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు వేయడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వివిధ గిరిజన సంఘాలు కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వేశాయి.
ఏజెన్సీకి బస్సులు ‘బంద్’
చర్ల: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునివ్వడంతో ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో ‘ఆపరేషన్ సమాధాన్’ను కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దీనిని మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా, జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ‘సమాధాన్’ వ్యతిరేక సభలు... సమావేశాలకు, 31న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు ఆంధ్ర–ఒడిశా, ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, బ్యానర్లు పడ్డాయి. మందుపాతర్లు పేల్చడం, బస్సులు.. లారీలకు నిప్పటించడం వంటి విధ్వంసకర చర్యలకు మావోయిస్టులు తెగించారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు మండం సరివెల సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి మందుపాతరను పేల్చారు. ఆర్టీసీ తాండూరు డిపో బస్సులకు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీకి నిప్పంటించారు. వీటన్నింటి నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment