సాక్షి, ఖమ్మం: జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ నెల 8న బందుకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసు బలగాలు చింతూరు, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వ విధానాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నదని పేర్కొంటూ, దీనికి నిరసనగా బందుకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
దీనిని జయప్రదం చేయాలంటూ గడిచిన పది రోజులుగా మావోయిస్టు పార్టీ పేరిట ప్రకటనలు వెలువడుతుండడం, బంద్‌ను విజయవంతం చేయాలని వెంకటాపురం మండలం కొండాపురంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పేరుతో బుధవారం పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో భద్రతను పెంచారు.
చింతూరు మండలంలోని మల్లంపేట, చర్ల సమీపంలోని కుర్నపల్లి, బత్తినపల్లి, ఎర్రంపాడు, తిప్పాపురం, పులిగుండాల, పూసుగుప్ప, దుమ్ముగూడెం మండలంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలైన ముల్కనపల్లి, పెద్దనల్లబెల్లి, పైడిగూడెం, కమలాపురం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు రెండు రోజుల నుంచి ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి.
గతంలో మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చినపుడు వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు కుర్నపల్లి-పెద్దమిడిసిలేరు, ఉంటుపల్లి-చర్ల మధ్య రోడ్లపై కందకాలు తవ్వారు. ఈసారి కూడా మావోయిస్టులు అలా చేస్తారేమోనని భావించిన పోలీసులు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గ్రామాల్లోకి రాత్రి వేళ ఏ రూట్లలో బస్సులు వెళ్తున్నాయో పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిర్భంధాన్ని నిరసిస్తూ 8న బంద్
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించి, నిర్బంధాన్ని కొనసాగిస్తున్నదని, దీనికి నిరసనగా ఈ నెల 8న చేపట్టిన బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ పేరిట గురువారం ‘సాక్షి’ కార్యాలయానికి ప్రకటన అందింది. చంద్రబాబు మాదిరిగానే కేసీఆర్ కూడా సింగపూర్, రోడ్లు, మెట్రో రైళ్లు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. విప్లవకారులపై ఎదురు కాల్పులు, విద్యార్థులపై లాఠీచార్జీ చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
యుద్ధ మేఘాలు
Published Fri, Nov 7 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement