బంద్ పిలుపుతో చర్లలో మూతబడిన దుకాణాలు
చర్ల: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ‘ఆపరేషన్ సమాధాన్’ను వ్యతిరేకిస్తూ, నిరసన వారానికి, 31న బంద్‌కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. భద్రాచలం ఏజెన్సీలోని ఇటు వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలతోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోనూ బంద్ సాగింది. మావోయిస్టుల హెచ్చరికలు, విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో రెండు రోజుల నుంచే ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. బ్యాంకులు, పెట్రోల్ బంక్‌లు, సినిమా హాళ్లు తెరుచుకోలేదు. దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలు, కార్యాలయాలు పనిచేశాయి. ఏజెన్సీ గ్రామాలకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు తిరగలేదు.
‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నిరసన వారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెలలోని అటవీ ప్రాంతంలోగల ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును, లారీని మావోయిస్టులు దహనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు సమీపంలో జేసీబీని దహనం చేశారు. అక్కడ వాల్ పోస్టర్లు పడేశారు, బ్యానర్లు కట్టారు. చర్ల మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు భద్రాచలం పట్టణ నడిబొడ్డునగల ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా పోస్టర్ అతికించారు.
మావోయిస్టు పార్టీ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దఎత్తున ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సుకుబా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోరాఫూట్, మల్కన్‌గిరి. రాయ్‌గడ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంచిర్యాల, కొమరం బీం ఆసీఫాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాలు వారం రోజుల ముందు నుంచే భారీగా మొహరించాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. అణువణువునా గాలించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజానీకం భీతిల్లింది. మావోయిస్టుల బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగంతోపాటు ఏజెన్సీ ప్రజానీకం హాయిగా ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment