కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త అధ్వర్యంలో మంగళ, బుధవారాలలో నిర్వహిస్తున్న దేశ వ్యాపిత సమ్మె మొదటి రోజైన మంగళవారం జిల్లాలో పాక్షికంగా జరిగింది. జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, ఎన్‌ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్ తదితర కర్మాగారాలలో కూడా సమ్మె ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. సమ్మె నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల జేఏసీల ఆ«ధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దçహనం చేశారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
జిల్లాలో ఉన్న 1.30 లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీసం రూ.18 వేలు ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ఆదాయపన్ను పరిధి రూ.5 లక్షలకు పెంచాలని, ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించాలని, గ్రంథాలయం, మార్కెట్, ఎయిడెడ్ ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇక సింగరేణిలోని కొత్తగూడెం రీజియన్‌లో 67 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఐటీసీ, కేటీపీఎస్, మణుగూరు భారజల కర్మాగారం, ఎన్‌ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్లలోని కార్మికులు కూడా విధులకు హాజరు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. అధికార పార్టీకి సంబంధించిన యూనియన్లు సమ్మెలో పాల్గొనక పోవడం, సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలలో ఉన్న అనైక్యతల కారణంగా సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బస్సులు లేక ఇబ్బందులు..
సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు సరిగా తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆటోలు యథావిధిగా తిరిగాయి. వర్తక, వాణిజ్యాలకు మాత్రం ఎలాంటి అటంకం కలుగలేదు. పాల్వంచ వంటి ప్రాంతాలలో బ్యాంకులు మామూలుగానే పనిచేశాయి. అయితే కొన్నిచోట్ల అంతర్గత లావాదేవీలను మాత్రమే నిర్వహించారు. పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల మొదట పనిచేసినప్పటికీ ఆందోళనకారుల ఒత్తిడితో బంద్ చేశారు. కాగా, బంక్‌లు ముందు తెరిచి, ఆ తర్వా త బంద్ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్న దేశవ్యాపిత సమ్మె దేశ చరిత్రలో 18వది కావడం గమనార్హం. గత నాలుగన్నర సంవత్సరాలలో 48 గంటల దేశ వ్యాప్త సమ్మె ఇదే మొదటిసారి. సమ్మె విచ్ఛిన్నానికి సింగరేణి తదితర సంస్థలు చేసిన కృషి ఫలించడం వల్లే కర్మాగారాలలో సమ్మె మొదటి రోజు పాక్షికంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment